చంద్రబాబు, కేసీఆర్… ఈ రెండు పేర్లు తెలుగు రాష్ట్రాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకరు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే… మరొకరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కావడం గమనార్హం. వీరిద్దరూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న సమయంలో కలిసి కూడా పనిచేశారు. ఆ తర్వాత.. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా వారు దూరమయ్యారు. ప్రస్తుతం అయితే… ఈ ఇద్దరు నేతలు డైరెక్ట్ గా చెప్పకున్నా.. శత్రువుల్లానే ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు ఓ కార్యక్రమం కోసం ఒకే వేదికను పంచుకోనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇంతకీ మ్యాటరేంటంటే… ఇండియన్ నేషనల్ లోక్ దళ్ సెప్టెంబర్ 25న హరియాణాలోభారీ ర్యాలీకి ప్లాన్ చేస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యల విధానాలను ప్రస్తావిస్తూ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో భాగంగానే ర్యాలీ చేపడుతున్నట్లు ఐఎన్డీఎల్ ప్రధాన కార్యదర్శి అభయ్ చౌతాలా తెలిపారు.
ఇందుకోసం దేశవ్యాప్తంగా పలు జాతీయ పార్టీల నేతలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఈ ర్యాలీకి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ సీఎం నితీష్, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, శిరోమణి అకాలీదళ్ నేత ప్రకాశ్ బాదల్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ తదితరులకు ఆహ్వానాలు అందాయి.
అయితే.. ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. ఎందుకంటే ఆయన ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా పార్టీని ఏర్పాటు చేయాలని కసరత్తులు మొదలుపెట్టారు. కానీ.. చంద్రబాబు హాజరు అవుతారా లేదా అనేదే అసలు చర్చ. ఎందుకంటే.. చంద్రబాబు… టీడీపీలో మళ్లీ అధికారంలోకి రావాలంటే.. ఏదో ఒక పార్టీ మద్దతు చాలా అవసరం. ఆ మద్దతు బీజేపీ నుంచే తీసుకునే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. మరి బీజేపీ నుంచి మద్దతు తీసుకునే పార్టీ… మళ్లీ బీజేపీ కి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటుందా అంటే కష్టమనే చెప్పాలి. అయితే.. ఇప్పటి వరకు మద్దతు విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు కాబట్టి… ఆ అభిప్రాయం లేకపోతే మాత్రం.. చంద్రబాబు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం మెండుగా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.