కర్నూలులో హైకోర్టు ఏర్పాటును చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని మంత్రి బుగ్గన రాజేందర్ రెడ్డి ఆరోపించారు. అసలు… చంద్రబాబుకి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయడం ఇష్టం ఉందో లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో జరుగుతున్న రాయలసీమ గర్జనలో పాల్గొన బుగ్గన ఈ వ్యాఖ్యలు చేశారు. హంద్రీనీవాకు మొదట చంద్రబాబు 13 కోట్లు ఇస్తే వైఎస్సార్ 4 వేల కోట్లు ఇచ్చింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రజలకు చెబుతున్నారని మండిపడ్డారు.
ఏపీలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చేయాలని సీఎం జగన్ చూస్తుంటే చంద్రబాబు దానికి అడ్డుపడుతున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతికి చెందిన 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంపై చంద్రబాబుకు ప్రేమ ఉందని బుగ్గన గుర్తుచేశారు. మేధావులు అధ్యయనం చేసి సూచించిన మేరకు మూడు సీఎం జగన్ 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని బుగ్గన వివరించారు.
కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో చేపట్టిన రాయలసీమ గర్జనకు విశేష స్పందన లభిస్తోంది. రాయల సీమ JAC ఏర్పాటు చేసిన ఈ సభకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరితో పాటు విద్యార్ధులు, మేధావులు, న్యాయవాదులతో పాటు అనేక వర్గాలకు చెందిన ప్రజలు రాయలసీమ గర్జనలో పాల్గొన్నారు.