బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు బీఆర్ఎస్ కూడా బహిష్కరించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరించినట్లు ఆ పార్టీలు తెలిపాయి. అంతే కానీ రాష్ట్రపతికి వ్యతిరేకంగా తాము లేని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కె.కేశవ రావు స్పష్టతనిచ్చారు.
ఈ సందర్భంగా కేకే ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మేం రాష్ట్రపతికి వ్యతిరేకం కాదు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాం. ప్రజాస్వామ్య పద్ధతిలో మా నిరసన ఉంటుంది. కేంద్ర ప్రజా వ్యతిరేక నిర్ణయాలు పార్లమెంట్ లో ఎండగడుతాం. అఖిలపక్ష సమావేశంలోనే ఈ విషయం స్పష్టంగా చెప్పాం. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగంపై ఉభయసభల్లోనూ కేంద్రాన్ని నిలదీస్తాం. అదానీ గ్రూపు వ్యవహారంపై కూడా ప్రశ్నిస్తాం’ అని తెలిపారు. గవర్నర్ల తీరుపై నిరసన తెలపాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు.