»Ap Inter Results 9 Inter Students Committed Suicide Due To Exams Fail
Interలో ఫెయిల్.. ఏపీలో 9 మంది విద్యార్థులు ఆత్మహత్య
చదువు లేనిదే జీవితం లేదనేది భ్రమ. పరీక్షల్లో తప్పితే జీవితం ముగిసిపోయినట్టు కాదు. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం లేదు. ఫలితంగా తమ నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు.
చదువు, విద్య (Education) అనేది తప్పనిసరిగా జీవితంలో (Life) ముఖ్యమైనది. చదువుతో అద్భుత భవిష్యత్ కు పునాది వేసుకోవచ్చు. కానీ చదువు లేనిదే జీవితం లేదనేది భ్రమ. పరీక్షల్లో తప్పితే (Fail) జీవితం ముగిసిపోయినట్టు కాదు. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడం లేదు. ఫలితంగా తమ నిండు జీవితాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా ఏపీలో విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో (AP Inter Results) ఫెయిలైన వారు బలవన్మరణాలకు (Suicide) పాల్పడుతున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాతి రోజు ఏకంగా 9 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో ఏపీలో తీవ్ర విషాదం ఏర్పడింది. పరీక్షల్లో ఫెయిల్.. ఇక జీవితంలోనూ ఫెయిల్ అనే భావనకు లోనై టీనేజర్లు అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ఆత్మహత్యకు పాల్పడిన వారి వివరాలు
– చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన అనూష (17) ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైంది. గురువారం చెరువులో దూకి ప్రాణం తీసుకుంది.
– చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాబు (17) ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం గణితంలో ఫెయిలయ్యాడు. ఫలితం చూసుకున్నాక బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్యహత్యకు పాల్పడ్డాడు.
– అనకాపల్లికి చెందిన కరుబోతు రామారావు, అప్పలరమణ దంపతుల కుమారుడు తులసీ కిరణ్ (17)కు ఫలితాల్లో తక్కువ మార్కులు వచ్చాయి. మనస్తాపానికి లోనైన ఆ విద్యార్థి గురువారం ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నాడు.
– శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) పరీక్ష తప్పాడు. ఫలితాలు చూసుకున్న అనంతరం టెక్కలిలో గురువారం తెల్లవారుజామున రైలు పట్టాల వద్దకు చేరుకున్నాడు. గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
– విశాఖపట్టణానికి చెందిన ఆత్మకూరు అఖిల శ్రీ (16) ఫెయిలైంది. ఈ భయంతో ఆత్మహత్య చేసుకోగా కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. అంత్యక్రియలు గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తుండగా పోలీసులు చేరుకున్నారు. అంత్యక్రియలు అడ్డుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించాలి.
– విశాఖపట్టణంలోని పల్నాటి కాలనీ శ్రీనివాస నగర్ లో నివసిస్తున్న బోనెల జగదీశ్ (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ పోయింది. గురువారం ఉదయం ఇంట్లోనే ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు.
– అనంతపురం జిల్లా కనెకల్లు మండలం హనకనహల్ గ్రామానికి చెందిన మహేశ్ (17) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఈ విషయం ఫలితాల్లో చూసిన తల్లిదండ్రులు నిలదీశారు. మందలించడంతో మనస్తాపం చెందిన మహేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
– ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి షేక్ జాన్ సైదా (16) మూడు సబ్జెక్టులు తప్పాడు. అతి తక్కువ మార్కులు రావడంతో ఆవేదనకు లోనై గురువారం ప్రాణం తీసుకున్నాడు.
– ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లుకు చెందిన రమణ రాఘవ ఇంటర్ రెండో సంవత్సరంలో ఒక సబ్జెక్టు తప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆత్మహత్యా యత్నం
విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన ఓ విద్యార్థి, రాజాం మండలానికి చెందిన మరో విద్యార్థి వేర్వేరుగా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇది చూసిన కుటుంబసభ్యులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. వారిద్దరూ వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రభుత్వ తప్పిదమా?
కాగా పెద్ద ఎత్తున విద్యార్థులు బలవన్మరణం పొందడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఫలితాల్లో తప్పిదాలు చోటుచేసుకోవడంతోనే పెద్ద ఎత్తున విద్యార్థులు పరీక్షలు తప్పారని తెలుస్తున్నది. మూల్యంకనంలో నిర్లక్ష్యం (Negligence) చేశారని.. పాసవ్వాల్సిన విద్యార్థులకు మరి పది లోపు మార్కులు రావడం విస్మయానికి గురి చేసిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అధికారుల (Officials) నిర్లక్ష్యంతోనే తమ పిల్లలు అఘాయిత్యాలకు పాల్పడ్డారని బాధిత కుటుంబసభ్యులు వాపోతున్నారు. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అండగా నిలబడింది. విద్యార్థులు ఫెయిల్ కావడానికి కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని టీడీపీ నాయకులు తెలిపారు.