మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విచారణ అనంతరం సీబీఐ దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ కు అత్యంత సన్నిహితుడు నవీన్ కు సీబీఐ నోటీసులు అందించిన విషయం తెలిసిందే. తాజాగా వారిద్దరూ శుక్రవారం సీబీఐ విచారణకు హాజరయ్యారు.
కడపలోని కేంద్ర కారాగారంలో ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, వైఎస్ భారతి నివాసంలో పని చేసే నవీన్ విచారణకు హాజరయ్యారు. విచారణలో అవినాశ్ రెడ్డి చెప్పిన వివరాలపై వారిద్దరితో ఆరా తీయనున్నట్లు సమాచారం. హత్య జరిగిన రోజు అవినాశ్ ఎందుకు ఫోన్లు చేశాడని నవీన్ ను అడిగే అవకాశం ఉంది. ఇక ఓఎస్డీతో కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. వీరిద్దరి విచారణను సీఎం జగన్ నిశితంగా గమనిస్తున్నారు. అయితే హత్య కేసులో సీబీఐ దూకుడుకు కళ్లెం వేయాలని ఢిల్లీ స్థాయిలో సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు ఫలించనట్టు కనిపిస్తోంది. అందుకే సీబీఐ మరింత మందితో విచారణ చేయనుంది.