మాంద్యం, రికార్డు ద్రవ్యోల్బణం నేపథ్యంలో అనేక కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా యాక్సెంచర్(Accenture) కూడా చేరింది. 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే మెటా, గూగుల్, అమెజాన్ వంటి సాంకేతిక దిగ్గజాలు తొలగింపులను ప్రకటించాయి.
ఈ మధ్యకాలంలో సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉద్యోగాల(jobs) కోత కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలు అయిన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా, ఐబీఎం సంస్థలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఇంకొంత మందిని కూడా సాఫ్ట్ వేర్ కంపెనీలు తొలగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ కంపెనీల జాబితాలోకి ప్రముఖ MNC కంపెనీ యాక్సెంచర్ పీఎల్సీ(Accenture plc) కూడా చేరింది. ఈ క్రమంలో తమ సంస్థ నుంచి 19,000 ఉద్యోగాలను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా అధ్వాన్నంగా తయారవుతున్న నేపథ్యంలో IT సేవల కార్పొరేట్ వ్యయాన్ని తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది.
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఈ సంస్థ సాంకేతిక బడ్జెట్లను తగ్గించగలదని యాక్సెంచర్(Accenture) అంచనా వేసింది. దీంతోపాటు ఆదాయం, లాభాల అంచనాల్లో తగ్గుదల ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇప్పుడు వార్షిక రాబడి వృద్ధి స్థానిక కరెన్సీలో 8% నుంచి 11% వరకు ఉంటుందని అంచనా వేస్తోంది. గతంలో 11.20 నుంచి 11.52 డాలర్లతో పోలిస్తే ఒక్కో షేరుకు సంపాదన 10.84 డాలర్ల నుంచి 11.06 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ ఇప్పుడు అంచనా వేస్తోంది. సగానికి పైగా తొలగింపుల ద్వారా తమ ఇతర సిబ్బందిపై ప్రభావం చూపుతాయని కంపెనీ చెబుతోంది.
మునుపటి నెలలో ఈ కంపెనీకి పోటీగా ఉన్న సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ నిదానమైన పెరుగుదలను సూచించింది. ఇది భవిష్యత్తులో IT సేవా సంస్థలు పొందగల ఒప్పందాలను సూచిస్తుంది. మొదటి త్రైమాసికంలో వారి రాబడి అంచనా మార్కెట్ అంచనా వేసిన దాని కంటే తక్కువగా ఉండటంతో ఇది జరిగింది.