ATP: రాప్తాడు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే పరిటాల సునీత శనివారం సమావేశం నిర్వహించారు. ఈనెల 20న సీఎం చంద్రబాబు నాయుడు 76వ జన్మదినాన్ని అన్ని గ్రామాలు, మండలాల్లో ఘనంగా జరపాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు.
కడపలో రూ.5 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లను అధికారులు ఏకపక్షంగా రద్దు చేయడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది. జనరల్ బాడీ ఆమోదించిన పనులను నిలిపివేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించింది. కేంద్ర నిధులతో చేపట్టాల్సిన పనులు ఎందుకు ఆపారో సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేసింది. అవసరమైతే ముట్టడి, న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించింది.
TPT: వాకాడులో వైసీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి శనివారం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో భేటీ అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సమస్యలు, నాయకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు.
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గళ్ళా మాధవి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మహిళా విద్యకు మార్గదర్శిగా నిలిచిన మహాత్మా పూలే సేవలు అపారమని కొనియాడారు.
TPT: స్థానిక గాంధీ రోడ్డులో కస్తూరిబా గాంధీ 157వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ ఛైర్మన్ డా. P.C.రాయులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో TDP రాష్ట్ర నాయకులు మబ్బు దేవనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కస్తూరిబా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నేతలు ఘనంగా నివాళులర్పించి సుమారు 1000 మంది పేదలకు వస్త్రదానం, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
PPM: శిశు, బాలల ఆరోగ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించి వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదల ధ్యేయంగా కృషి చేయాలని రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమ జిల్లా అధికారి డా. టి.జగన్ మోహనరావు పేర్కొన్నారు. జగన్నాధపురం 30వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సార్వత్రిక టీకా కార్యక్రమాన్ని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గడువు తేదీకి టీకా అర్హుల జాబితా పరిశీలించారు.
ELR: పీ.ఆర్ 126 రకం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, నాణ్యమైన గోనె సంచులు అందించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ కోరారు. శనివారం భీమడోలు మండలం గుండుగొలను సొసైటీ వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే ధర్మరాజును కలిసి రైతు సంఘం నాయకులు సమస్యను వివరించారు.
E.G: రంగంపేట రైతు సేవా కేంద్రం వద్ద యువసేన ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం PACS ఛైర్మన్ గారపాటి రాంబాబు ప్రారంభించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు నేతలు తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KRNL: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజీ పర్యవేక్షణలో, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్లలో శనివారం మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు.
అన్నమయ్య: రైతుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని రైతు సంఘం నేతలు విమర్శించారు. గిట్టుబాటు ధరలు, ఎరువుల కొరత, మార్కెట్ దోపిడీతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 50 ఏళ్లు దాటిన రైతులకు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ELR: వైసీపీని, పార్టీ నాయకుల కుటుంబ సభ్యుల మీద నీచ, నికృష్టమైన భాషతో దూషించిన ఏబీఎన్ రాధాకృష్ణపై వైసీపీ శ్రేణులు శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రచారం చేసిన వ్యక్తుల అందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ దెందులూరు నియోజకవర్గలోని పెదవేగి, పెదపాడు, దెందులూరు, ఏలూరు రూరల్ మండలం పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు.
CTR: నగరి నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తన కార్యాలయంలో వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకొని, సంబంధిత అధికారులకు తక్షణ పరిష్కారానికి సూచనలు చేశారు. సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన తెలిపారు.
KDP: ఖాజీపేట అగ్రహారంలో జరిగిన యువతి కీర్తన హత్య ఘటనపై రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిమ్స్ మార్చురీలో మృతదేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
W.G: స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆకివీడు పరిసరాల పరిశుభ్రత కోసం మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. జాతీయ రహదారి వెంబడి చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా నియంత్రించేందుకు తడి, పొడి చెత్తతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాల కోసం ట్విన్ బిన్స్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటేశ్వరరావు, సానిటరీ ఇన్స్పెక్టర్ సాకేత్, సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో జిల్లాను ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కార్గో ఎయిర్పోర్ట్ వ్యతిరేక పోరాట కమిటీ అధ్యక్షన శనివారం పలాసలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. భూమిపైన ఉపాధి పొందుతున్న ప్రజలకు భూమి నుంచి వెళ్లగొడితే ఈ ప్రాంతమంతా నాశనం అయిపోతుందని వారు పేర్కొన్నారు.