జగన్ను మీరు విమర్శించలేదా: సొంత పార్టీ నేతలపై రఘురామ
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కలయికను వైసీపీ నేతలు తప్పుపట్టడంపై ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆయన పార్టీ నుండి గెలిచినప్పటికీ మొదటి నుండి నిరసన గళం వినిపిస్తూనే ఉన్నారు. గతంలో చంద్రబాబు-పవన్ పరస్పరం తిట్టుకున్నారని, అలాంటప్పుడు వారు ఎలా కలుస్తారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై రఘురామ ఇచ్చిన సమాధానం పార్టీనే ఇరకాటంలో పడేసింది. సాధారణంగా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండదనేది నానుడి. దానిని వైసీపీ మరిచిపోతే ఎలా అన్న విధంగా అటువైపు నుండి ఏం చెప్పలేనివిధంగా బదులిచ్చారు.
చంద్రబాబును ఇదివరకు విమర్శించిన పవన్ ఇప్పుడు ఆయనతో ఎలా కలుస్తారని తమ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారని, కానీ ప్రస్తుతం జగన్ మంత్రివర్గంలో ఉన్న కొంతమంది అయనను విమర్శించిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీలో చేరిన జూపూడి ప్రభాకర రావు, వల్లభనేని వంశీ గతంలో జగన్పై తీవ్ర విమర్శలు చేశారని గుర్తు చేశారు. బొత్స సత్యనారాయణ, విడదల రజిని వంటి పలువురు నేతలు ఇతర పార్టీలలో ఉండి జగన్ను విమర్శించిన వారే.
రఘురామ ఇంకా మాట్లాడుతూ… టీడీపీ పసుపు, జనసేన రంగు ఎరుపు కలిపితే కాషాయం అవుతుందని, ఆ రెండు పార్టీలకు మరో పార్టీ తోడుండాలని తాను కోరుకుంటున్నానన్నారు. బలం సరిపోనప్పుడు గౌరవాన్ని కాపాడుకుంటూనే మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పవన్ కళ్యాణ్ సూచనతో రఘురామ ఏకీభవించారు. బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలోని డైలాగ్లను చూసి తమ పార్టీ నేతలు భుజాలు తడుముకోవడం ఎందుకో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.