విశాఖలో జరుగుతున్న కాపు మహా సభలకు వైసీపీ నేతలు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ కాపు మహా సభలకు వైసీపీ కాపు నాయకులంతా దూరమయ్యారు. కాపునాయకులంతా ఈ మీటింగ్ లో కలుస్తారని అందరూ అనుకున్నారు. సడెన్ గా ఈ సమావేశాలను వైసీపీ నేతలు బాయ్ కాట్ చేయడం గమనార్హం.
రాధా-రంగా అసోసియేషన్ పేరుతో విశాఖలో నిర్వహిస్తున్న కాపు నాడు సభకు.. దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ నాయకులు ఎవరూ హాజరుకావొద్దని పార్టీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. వైసీపీ నేతలు వేదికపై ఉన్న సమయంలో.. జైజనసేన నినాదాలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశ్యంతో.. ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అటు సభకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. అయితే.. తాజా పరిస్థితుల దృష్ట్యా ఈ సభ పూర్తిగా టీడీపీ, జనసేన నాయకుల ఆధ్వర్యంలో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది. వంగవీటి రంగా వర్ధంతిని పురస్కరించుకుని సోమవారం విశాఖపట్నంలో కాపు సంఘం నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. పార్టీలకతీతంగా ఈ సమావేశం జరగనుందని ప్రకటించారు. విశాఖపట్నం ఏఎస్ రాజా గ్రౌండ్స్‌లో ఈ సమావేశం జరగనుంది. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ నాయకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం ఎలా ఉంటుందనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.