తాను పార్టీ మారుతున్నట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఖండించారు. తాను చివరి వరకు జగన్‌తోనే ఉంటానని చెప్పారు. ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటానని లేదంటే రాజకీయం మానేసి ఇంట్లో కూర్చుంటానని చెప్పారు. తన భర్త తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం సాగుతోందని, అలా అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరికి తోచింది వారు రాసుకుంటారని, వాటిని పట్టించుకోవద్దని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే తన భర్త కేంద్రంలో అధికారిగా ఉన్నారని, తాను వైసీపీలోకి వెళ్తానంటే అభ్యంతరం చెప్పలేదన్నారు. తాము పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు.
సుచరిత గతంలో హోంమంత్రిగా పని చేశారు. రెండోసారి ఆమెకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. కేబినెట్లో చోటు దక్కక పోవడంతో ఆమె అప్పుడు అసంతృప్తికి గురయ్యారు. ఆమెను కేబినెట్లోకి తీసుకోవాలని సుచరిత వర్గీయులు ఆందోళన కూడా చేశారు. అయితే ఆ తర్వాత ఆమెకు గుంటూరు వైసీపీ బాధ్యతలను అప్పగించారు. నవంబర్ నెలలో ఆమె ఈ పదవి నుండి కూడా తప్పుకున్నారు. తన నియజకవర్గం ప్రత్తిపాడుకు పరిమితమవనున్నట్లు తెలిపారు. అయితే రెండు రోజుల క్రితం ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి కారణమయ్యాయి.
రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా కాకుమానులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తాము వైసీపీతోనే ఉంటామని చెబుతూనే, నేను ఓ స్టేట్మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడి ఉంటారని, అలాకాకుండా అతను పార్టీ మారుతానంటే తాను ఓ భార్యగా ఆయన అడుగు జాడల్లో నడుస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. తన భర్త ఓ పార్టీలో, నేను ఓ పార్టీలో, నా పిల్లలు మరో పార్టీలో ఉండరని, వైసీపీలో ఉండగలిగినన్ని రోజులు ఉంటామన్నారు. తాము ఈ పార్టీ కుటుంబ సభ్యులమేనని, ఒక ఇంట్లో నలుగురు ఉంటేనే భిన్నాభిప్రాయాలు ఉంటాయని, అలాంటిది పార్టీలో సహజమే అన్నారు. విభేదాలు ఉన్నంత మాత్రాన ఎవరూ వేరు కాదన్నారు.