»Secunderabad Tirupati Vande Bharat Express Runs From April 9
హైదరాబాద్-తిరుపతి మధ్య Vande Bharat Express.. ఎప్పటి నుంచి అంటే..
తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రధాని పర్యటించేందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఖరారైన పర్యటన రద్దు చేసుకున్నారని ఉదాహరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల (Telugu States) మధ్య మరో వందే భారత్ (Vande Bharat Express) రానున్నది. ఇప్పటికే హైదరాబాద్ (Hyderabad)- విశాఖపట్టణం (Visakhapatnam) మధ్య తొలి వందే భారత్ రైలు పరుగులు పెట్టనుండగా.. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతికి (Tirupati) వందే భారత్ రైలు ప్రయాణం మొదలు కానుంది. వందే భారత్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 8వ తేదీన ఈ రైలు ప్రారంభోత్సవం (Launch) ఉండనుంది. రైలు మాత్రం 9వ తేదీన పరుగులు పెట్టనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. మోదీ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రపంచంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా తిరుమల (Tirumala) వెలుగొందుతోంది. తెలంగాణ (Telangana) నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుపతికి వెళ్తుంటారు. తిరుపతికి వెళ్లేందుకు సాధారణ రైళ్లు ఎప్పుడూ కిక్కిరిసి ఉంటాయి. పైగా 12 గంటలకు పైగా ప్రయాణ సమయం అవుతోంది. ఈ మార్గంలో అత్యంత వేగంగా పరుగు పెట్టే వందే భారత్ అందుబాటులోకి రావడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ -తిరుపతికి 8.30 గంటల ప్రయాణ సమయం ఉండనుంది. అయితే చార్జీలను ఇంకా రైల్వే శాఖ (Indian Railways) ప్రకటించలేదు.
ఏప్రిల్ 9న తిరుపతి నుంచి వందే భారత్ హైదరాబాద్ కు చేరుకోనుంది. 10వ తేదీన హైదరాబాద్ లోని సికింద్రాబాద్ (Secunderabad) నుంచి రైలు తిరుపతికి బయల్దేరుతుంది. మంగళవారం మినహా ప్రతి రోజూ వందే భారత్ రైలు ప్రజలకు అందుబాటులో ఉండనుంది. కాగా వందే భారత్ రైలు సమయపాలనను రైల్వే శాఖ ప్రకటించింది. హైదరాబాద్ లో ఉదయం 6 గంటలకు బయల్దేరుతుండగా తిరుపతికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతిలో మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45కు చేరుకుంటుందని రైల్వే శాఖ తెలిపింది.
కాగా ఈ రైలు ప్రారంభోత్సవానికి ప్రధాని హాజరవుతారని ప్రచారం సాగుతోంది. గతంలో తెలంగాణకు ప్రధాని వస్తారని షెడ్యూల్ ఖరారైంది. అయితే ఏం జరిగిందో తెలియదు. అకస్మాత్తుగా మోదీ పర్యటన రద్దయ్యింది. రెండుసార్లు ఇలాగే జరిగింది. దీంతో ఈసారి కూడా వస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, వందే భారత్ రైలు ప్రారంభోత్సవం చేస్తారని గతంలో ప్రధాని కార్యాలయం, రైల్వే శాఖ ప్రకటించింది. కానీ కార్యక్రమాలు రద్దయ్యాయి. తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ప్రధాని పర్యటించేందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందులో భాగంగానే ఖరారైన పర్యటన రద్దు చేసుకున్నారని ఉదాహరిస్తున్నారు.