నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు అధికారి ఎంఎన్వీ రాజు తెలిపారు. ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ పోటీలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారన్నారు.
VZM: మద్యం మత్తులో ఓ వ్యక్తి మదుంలో పడి మృతి చెందిన ఘటన కొత్తవలస ఆర్ధన్నపాలెంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. బలిఘట్టం గ్రామానికి చెందిన షేక్ మస్తాన్(52) ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆదర్శ పాఠశాల వైపుగా వెళ్తున్న వ్యక్తి మృతదేహాన్ని చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ప్రకాశం: కనిగిరిలో నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతలు ఆర్డీవోకు వినతి పత్రం మంగళవారం సమర్పించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 99 వేల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు నెలకు రూ.3,000 భృతి అందించాలని కోరారు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పుకొచ్చారు.
KDP: ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని అర్బన్ సీఐ శ్రీరామ్ అన్నారు. ఇవాళ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా MEO చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ.. క్రమశిక్షణ విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉన్నత చదువులు అభ్యసించాలన్నారు.
BPT: కాకుమాను మండలం కొండపాటూరులోని పోలేరమ్మ ఆలయానికి బాపట్ల భావనారాయణ స్వామి ఆలయం నుంచి సాంప్రదాయ సారెను అందించారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించిన కమిటీ సభ్యులు కానుకలను ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. గత 12 ఏళ్లుగా ఈ పరంపర కొనసాగుతోందని తెలిపారు. ఈ సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన జరగనుంది.
PLD: ఎవరైతే డాక్యుమెంట్స్ ఉండి, ఆన్‌లైన్‌లో నమోదు కాకుండా వెబ్ ల్యాండ్‌లో ఇతరుల కాలమ్స్ ఉన్న వారు తమను సంప్రదించాలని దాచేపల్లి తహసీల్దార్ జీ. శ్రీనివాస యాదవ్ తెలిపారు. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. తహసీల్దార్‌ని కలసి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్‌ను సబ్మిట్ చేస్తే అర్హులైన వారి పొలాలను వారి పేరు మీద చేస్తామని చెప్పుకొచ్చారు.
TPT: నారాయణవనం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన గ్రామ పంచాయతీ సర్పంచుల పదవీకాలం పూర్తైన సందర్భంగా ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పదవీకాలంలో గ్రామాభివృద్ధికి కృషి చేసిన సర్పంచులను శాలువాలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని తెలిపారు.
KRNL: గతేడాది నన్నూరు సమీపంలో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందిన మునగాలపాడు గ్రామానికి చెందిన TDP కార్యకర్త అర్జున్ కుటుంబసభ్యులను ఇవాళ మంత్రి లోకేష్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలిపించారు. అర్జున్ తల్లిదండ్రులు మద్దిలేటి, రాణి, సోదరి కోమలితో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
W.G: నిషేధిత భూముల సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 7 నుంచి 15 వరకు ఆచంట మండలంలో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ సోమేశ్వరరావు తెలిపారు. రికార్డుల్లో మార్పులు, చేర్పులు సరిచేసుకోవడానికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. రెవెన్యూ, ఎండోమెంట్స్, ఇరిగేషన్ అధికారులు ఈ సభల్లో పాల్గొంటారని, భూ యజమానులు తమ వివరాలను సరిచూసుకోవాలని ఆయన సూచించారు.
VZM: క్రిస్టియన్స్‌పై వివక్ష చూపరాదని, దళిత క్రైస్తవులకు ప్రభుత్వ సదుపాయాలు కల్పించాలని రెవరెండ్ డా. LK మృత్యుంజయ అన్నారు. ది డిస్ట్రిక్ట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు స్థానిక SMB చర్చిలో ఇవాళ ఘనంగా జరిపారు. ఈ మేరకు సంఘమిత్ర RS జాన్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో క్రైస్తవుల బర్రెల్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
AKP: వేసవికాలంలో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలమంచిలి రూరల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆటోపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మైక్‌లో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. కరపత్రాలలో అతికిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
NDL: నంద్యాల మండలం గుంతనాల, బి.శివరామపురం గ్రామాలలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి ఎన్ఎండీ ఫరూక్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగలక్ష్మి, ఎంపీటీసీ చిలుకూరి సుజాత, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
PPM: పాలకొండ బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా పల్లా మునిస్వామి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా ఎం. వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా అల్లెన శివదాసు, సంయుక్త కార్యదర్శిగా వై. ప్రకాశ్, కోశాధికారిగా ఎం. జగన్మోహన్ బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన కార్యవర్గానికి సీనియర్ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.
VSP: 2026–27 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఔట్ రీచ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశం జరిగింది. జిల్లా ఇంఛార్జ్ మంత్రి శ్రీ బాలవీరాంజనేయ స్వామి బడ్జెట్ అంశాలపై సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
KDP: ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఇవాళ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో జరుగుతున్న అబివృద్ధి పనుల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈనెలలో మూడు సార్లు ఆసుపత్రిని ఎమ్మెల్యే సందర్శించారు. కంటి విభాగం, వాష్ రూముల నిర్మాణాలను పరిశీలించారు. ఎస్ఈ లక్ష్మీపతి రెడ్డికి ఫోన్ చేసి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.