• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

వృత్తి నైపుణ్యాభివృద్ది శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

VZM: వృత్తి నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఆసక్తి గల అబ్యర్దులు జనవరి 2 లోగా దరఖాస్తు చేసుకోవాలని విజయనగరం మునిసిపల్ కమీషనర్ పి.నల్లనయ్య ఆదివారం సూచించారు. ఈ కార్యక్రమంలో ఎలాక్టిషియన్‌, టీవీ, వాషింగ్‌ మిషన్‌, గ్రీజర్‌, రిఫ్రిజిరేటర్‌, ప్లంబింగ్‌, కార్పెంటర్స్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఆసక్తి ఉన్నవారు మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

December 30, 2024 / 04:18 AM IST

పోలీసుల దాడి.. 600లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

KKD:పెద్దాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఎక్సైజ్ సిబ్బంది ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పెద్దాపురం పరిధిలో సారాయి తయారీ కోస‌ం నిల్వ ఉంచిన 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు ఎక్సైజ్ సీఐ అర్జునరావు తెలిపారు. ఉప్పలపాడులో 600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.

December 30, 2024 / 04:18 AM IST

నేటి నుంచి గ్రిగ్స్ పోటీలు

SKLM: వజ్రపుకొత్తూరు గోవిందపురం ఉన్నత పాఠశాలలో ఈనెల 30, 31న గ్రిగ్స్ మీటను నిర్వహించనున్నట్లు హెచ్ఎం కె.హరిబాబు, పీడీ .నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. కావున నియోజకవర్గంలోనే ఉన్న క్రీడాకారులు ఈ విషయాన్ని గమనించి ఈ పోటీలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పాఠశాల అనుమతి తప్పనిసరి అన్నారు.

December 30, 2024 / 04:17 AM IST

జనవరి 7న పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికలు

SKLM: పారా అథ్లెటిక్స్ ఛాంపియన్- 2025 పోటీల్లో పాల్గొనేందుకు ఎంపికలు నిర్వహించనున్నట్లు స్టీఫెన్ హాకింగ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము తెలిపారు. జిల్లా స్థాయి ఎంపికల్లో పాల్గొనేందుకు క్రీడా కారులు తమ వివరాలను జనవరి 5లోగా నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు 9381368209 నంబర్ సంప్రదించాలని తెలిపారు.

December 30, 2024 / 04:16 AM IST

జాబ్ మేళాకి విశేష స్పందన

పల్నాడు: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జాబ్ మేళాకి విశేష స్పందన లభించింది. 35 ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా 1,800ల మంది నిరుద్యోగ యువతీ, యువకులు పాల్గొన్నారు. ఇందులో 600 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే అతిథిగా హాజరై ఉద్యోగాలు సాధించిన వారికి నియామకపత్రాలను అందజేశారు.

December 30, 2024 / 04:15 AM IST

కైకలూరు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలివే..

కృష్ణా: ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సోమవారం ఉదయం 10గంటలకు అమరావతిలో జరిగే రెవెన్యూ శాఖ సమీక్షలో పాల్గొంటారని ఆయన కార్యాలయ సిబ్బంది తెలిపారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు విజయవాడలో జరిగే విశ్వ హిందూ పరిషత్ ముఖ్య ప్రముఖుల సమావేశంలో పాల్గొని వచ్చే నెలలో జరగనున్న హైందవ శంఖారావం ఏర్పాట్లపై చర్చిస్తారని ఆయన కార్యాలయ సిబ్బంది నేటి షెడ్యూల్ వివరాలను వెల్లడించారు.

December 30, 2024 / 04:15 AM IST

ఎమ్మెల్యే మాధవి దంపతులను కలిసిన జేడీ లక్ష్మీనారాయణ

CBI మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ఆదివారం గుంటూరు నగరానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, నరెడ్కో అమరావతి ఛాప్టర్ అధ్యక్షుడు గళ్ళా రామ చంద్రరావు దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ కలయికపై నగరంలో సర్వత్రా చర్చ జరుగుతుంది.

December 30, 2024 / 04:14 AM IST

‘రైతు కుటుంబాన్ని పవన్ ఎందుకు పరామర్శించలేదు’

కడప: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లాకు వచ్చి అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని పరామర్శించకపోవడం బాధాకరమని వైసీపీ నేత, ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ ఛైర్మన్ రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి అన్నారు. ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో ఆదివారం రెడ్డెం విలేకరులతో మాట్లాడుతూ.. గాలివీడు ఎంపీడీఓను పరామర్శించేందుకు వచ్చిన వారు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

December 30, 2024 / 04:12 AM IST

వైసీపీకి ఇంకా సిగ్గు రాలేదా: నాగేశ్వరరావు

పల్నాడు: వినుకొండ నియోజకవర్గ ప్రజలు కూటమికి 31 వేలు మెజారిటీ ఇచ్చి వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించినా వైసీపీకి ఇంకా సిగ్గు రాలేదా అని తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి పెమ్మసాని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఎటువంటి అర్హత స్థాయి లేని ఎంఎన్ ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే మక్కెనపై విమర్శలు చేయటం తగదన్నారు.

December 30, 2024 / 04:12 AM IST

నేడు పెద్దాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం: RDO

KKD: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేయబడిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS ) కార్యక్రమం సోమవారం పెద్దాపురంలో జరగనున్నట్లు RDO శ్రీరమణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. అధికారులు అందరూ విధిగా హాజరు కావాలని ఆయన ఆదేశించారు. ఉదయం 9.30 గంటలకు హాజరుకావాలని సూచించారు.

December 30, 2024 / 04:10 AM IST

‘దాడిని సమర్థించడం మాజీ ఎమ్మెల్యేకి తగదు’

అన్నమయ్య: ఎంపీడీఓ జవహర్ బాబుపై ఆధిపత్య ధోరణితోనే గాలివీడు వైసీపీ మండలం నాయకుడు సుదర్శన్ రెడ్డి దాడి చేశాడని, దీనిని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి సమర్థించడం దారుణం అని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.అంకన్న అన్నారు. లక్కిరెడ్డిపల్లె మండలం ఆదివారం దప్పేపల్లి పంచాయతీ జాండ్రపేటలో మాట్లాడారు.

December 30, 2024 / 04:10 AM IST

నరసాపురం నుంచి బనారస్‌కు ప్రత్యేక రైళ్లు

W.G: నరసాపురం నుంచి బనారస్ (వారణాసి) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు స్టేషన్ మేనేజర్ మధుబాబు ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నరసాపురం నుంచి రాజమండ్రి, దువ్వాడ, విజయనగరం, రాంచి, రాయగడ మీదగా జనవరి 26, ఫిబ్రవరి 2లో ఉదయం 6కు నెం.07109 రైలు బనారస్‌కు బయలుదేరుతుందన్నారు. జనవరి 27, ఫిబ్రవరి 3న బెనారస్ నుంచి నరసాపురానికి రైలు వస్తుందన్నారు.

December 30, 2024 / 04:10 AM IST

పాతపట్నంలో నేడు జాబ్ మేళా

SKLM: పాతపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి యు సాయికుమార్ ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభి వృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా SSC , INTER, DEGREE పూర్తిచేసిన 18 – 35ఏళ్లు గల M/F లు జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.

December 30, 2024 / 04:09 AM IST

కూచిపూడి నాట్యపతాక స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

W.G: కూచిపూడి నృత్యం ప్రత్యేక జెండా రూపొందించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా 50 అడుగుల ఏకశిల ప్రతిష్ఠ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా కూచిపూడి హెరిటేజ్ ఆర్ట్స్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పాల్గొన్నారు. అనంతరం కూచిపూడి నృత్యాలను ఆయన వీక్షించి సంతోషం వ్యక్తం చేశారు.

December 30, 2024 / 04:09 AM IST

నెల్లూరులో WBM రోడ్డు పనులకు శంకుస్థాపన

నెల్లూరు రూరల్ పరిధిలోని 26వ డివిజన్ డ్రైవర్ కాలనీలో రూ.40 లక్షల నిధులతో WBM రోడ్డు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. 26వ డివిజన్లో ఆరు నెలల్లో రూ.1 కోటి 25 లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎప్పుడు ఏ చిన్న సమస్య కలిగిన తనకు ఒక ఫోన్ కాల్ చేస్తే స్పందిస్తానని పేర్కొన్నారు.

December 30, 2024 / 04:09 AM IST