అన్నమయ్య: గాలివీడు మండలం గండిమడుగులో శనివారం ఒక మహిళ మృతదేహం లభ్యమైంది. నంది మండలానికి చెందిన అనితమ్మ (69) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం లక్కిరెడ్డిపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WG: తణుకు పట్టణానికి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత రసరాజు రాసిన చేతనాకేతనం పద్య కవిత సంపుటి తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం రాత్రి ఆవిష్కరించారు. సజ్జాపురం రామకృష్ణ మఠం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాహితీ వినీలాకాశంలో తణుకును తళుక్కుమనేలా చేసిన అద్భుత సాహితీ ప్రతిభాశాలి అని కొనియాడారు.
SKLM: మాదక ద్రవ్యాలు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని పొన్నూరు ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. గంజాయి, మత్తు పదార్థాలు, ప్రభుత్వం నిషేధించిన వాటిని ఎవరైనా రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
NDL: ప్యాపిలి మండలం బురుగులలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయ పునరుద్ధరణ పనుల కోసం డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఆ విరాళాన్ని డోన్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆలయ నిర్వాహకులకు శనివారం అందజేశారు. ఆలయ పునరుద్ధరణకు సహకరించినందుకు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.
VSP: ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. విశాఖపట్నాన్ని ప్రధాన సినీ నిర్మాణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
TPT: తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో శనివారం గరుడ సేవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమధుర భక్తి గీతాలు, నృత్య ప్రదర్శనలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయ పరిసరాలు రామనామంతో మారుమోగాయి.
KRNL: ఆలూరు మండలం కమ్మరచేడులో ఈనెల 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకల సందర్భంగా గ్రామస్థులు వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్‌వీ మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. గ్రామ పెద్దలు, యువకులు ఆయనను కలుసి కార్యక్రమానికి విచ్చేసి వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
అనకాపల్లికి చెందిన వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు బీజేపీ పార్టీలో చేరారు. శనివారం విశాఖలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆయనకు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలో ఆహ్వానించారు. బీజేపీ ఆశయాలు సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల విశ్వాసంతో పార్టీలో చేరినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు.
E.G: దేవరపల్లి మండలం యాదవోలు గ్రామంలో 40 ఏళ్లుగా కొనసాగుతున్న భూ వివాదం ముగిసింది. కొల్లూరు సుబ్బమ్మకు చెందిన 14 ఎకరాల భూమిని 1982 నుంచి పాసుపుస్తకాలు లేకుండానే స్థానిక పేద రైతులు సాగు చేస్తున్నారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించగా, తాజాగా భూమి హక్కు పట్టాదారులదేనని తీర్పు వెలువడింది. శనివారం ఎమ్మెల్యే మద్దిపాటి లబ్ధిదారులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు.
ELR: నూజివీడు పట్టణంలోని శారద డిగ్రీ కళాశాలలో 25వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారని కోఆర్డినేటర్ డి.రామకృష్ణ తలిపారు. 11 కంపెనీల ప్రతినిధులు పాల్గొనే ఈ మేళాలో 925 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్న అభ్యర్థులు హాజరు కావాలని ఆయన కోరారు.
NDL: వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఇవాళ బనగానపల్లె మండలం నందవరం ఆలయానికి వస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు తెలిపారు. నందవరంలో కొలువైన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి దర్శనానికి మంత్రి సత్యకుమార్ వస్తున్నారని చెప్పారు. రాత్రి 8 గంటలకు నందవరం ఆలయానికి వస్తారని, ఏర్పాట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ATP: జిల్లా మట్టి వాసనతో రూపొందిన ‘సొట్టా బుగ్గల పిల్లో’ ఫోక్ సాంగ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి అతిథిగా పాల్గొని పాటను ఆవిష్కరించారు. అనంతపురం స్వరం, ఇక్కడి లొకేషన్లలోనే చిత్రీకరించిన ఈ జానపద గీతంపై ఆమె ప్రశంసలు కురిపించారు. కళాకారులను ప్రోత్సహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
PPM: బలిజిపేట మండలం అజ్జాడ గ్రామంలో శనివారం YCP సీనియర్ కార్యకర్తల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన పెంకి సంజీబు, బడే నరసింహ నాయుడు, పోల చిన్నం నాయుడు కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చిత్తూరు జిల్లాలో కేంద్రీయ విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైనట్లు జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు. ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందన్నారు. చిత్తూరులోని ఇరువారం, కుప్పంలోని కేంద్రీయ విద్యాలయాల్లో తరగతులు ప్రారంభంకానున్నాయి. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కృష్ణా: గన్నవరం మండలంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఇవాళ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బలిపర్రు, వీరపనేనిగూడెం, తెంపల్లి ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు కరెంట్ నిలిపివేయనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.