KDP: సిద్ధవటంలోని ZP హైస్కూల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రెండో రోజు బుధవారం పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య నిర్వహించబడ్డాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పర్యవేక్షించారు. విద్యార్థులు సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకుని నిబంధనలను పాటిస్తూ పరీక్ష రాశారు.
CTR: పట్టణాల్లో ఆస్తి, నీటి పన్ను లక్ష్యాలను చేరుకునేందుకు కేవలం 14 రోజులు మాత్రమే గడువు ఉంది. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు, నగరి, కుప్పం మున్సిపాలిటీల పరిధిలో సుమారు రూ.56 కోట్ల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.30 కోట్లు మాత్రమే వసూలు అయినట్లు అధికారులు చెబుతున్నారు.
KRNL: నారాయణపురం గ్రామంలో సర్పంచ్ సరళమ్మ ఆధ్వర్యంలో ఇవాళ పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని వీధి వీధి తిరిగి పారిశుద్ధ్య కార్మికులతో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. మురికి కాలవలను శుభ్రపరిచి మురుగు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకున్నారు. అంటువ్యాధులు, దోమలు వ్యాపించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ గ్రామ ప్రజలకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు.
ATP: YCP అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడిపత్రి సీనియర్ నాయకుడు కొనుదుల రమేష్ రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా జగన్ ఆయనకు పలు సూచనలు చేశారు. కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడాలని దిశానిర్దేశం చేశారు.
TPT: గుంతకల్ డివిజన్‌లో రైల్వే ట్రాక్ పనుల కారణంగా తిరుపతి-కాట్పాడి రైలు సేవల్లో అంతరాయం ఏర్పడింది. రైలు నెంబర్ 16853/16854 తిరుపతి నుంచి కాకుండా, కాట్పాడి నుంచి సాయంత్రం 4:45కు బయలుదేరనుంది. మార్చి 20, 23, 27, 30, ఏప్రిల్ 3, 6, 10, 13 తేదీల్లో తిరుపతి-కాట్పాడి మధ్య పాక్షికంగా ఈ రైలును రద్దు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
E.G: కొవ్వూరులో అల్లూరి బాపినీడు 115వ జయంతి కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పట్టణ ప్రముఖులు, పలువురు నాయకులు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. విద్యా ప్రదాత బాపినీడు సర్ సి.ఆర్ రెడ్డి కళాశాలను స్థాపించడానికి విశేషమైన కృషి చేసి అనేక మందికి విద్య, ఉపాధి అవకాశాలు కల్పించాడని వారు కొనియాడారు.
SKLM: ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు అమరావతిలో సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావును కలిశారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో నూతన భవనాలను మంజూరు చేయాలని MLA కోరారు. నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హాబ్‌గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు.
NLR: ఆత్మకూరులో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 70 మందికి రూ.44.63 లక్షల చెక్కులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం అందించారు. అలాగే ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామానికి చెందిన నరసింహారెడ్డికి పార్టీ సభ్యత్వం ఉండి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును మంత్రి అందించారు.
E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవలేశ్వరంలో ఉన్న గ్యాస్ కంపెనీ వద్ద వినియోగదారులు బుధవారం పడిగాపులు కాస్తున్నారు. బుకింగ్ చేసుకున్నప్పటికీ సిలిండర్లు సకాలంలో ఇంటికి చేరకపోవడంతో ప్రజలు ఏజెన్సీ కార్యాలయానికి వచ్చారు. మరో పక్క గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నారు. డెలివరీ ఆలస్యమైతే సంబంధిత కంపెనీ హెల్ప్‌లైన్ నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
KDP: మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని పాఠశాల SO గురుదేవి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఖాళీగా ఉన్న తొమ్మిది సీట్లకు, 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు.
NDL: బనగానపల్లె (M) నందవరంలో చౌడేశ్వరి మాతకు బుధవారం చతుర్దశి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని పసుపు పారాయణంతో అలంకరించారు. వేద పండితులు కుంకుమార్చన, రుద్రాభిషేకం, మహామంగళహారతి నిర్వహించారు. చతుర్దశి సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.
AKP: వి.మాడుగుల మండలం అవురువాడ పంచాయతీ పరిధిలోని పశువులబంద PVTG కొందు గిరిజన గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కానుంది. RWS అధికారులు గ్రామాన్ని సందర్శించి పైప్‌లైన్ పనులను ప్రారంభించారు. ఎత్తైన కొండ ప్రాంతం కావడంతో గిరిజనులే మంచినీటి పైపులను మోసుకుంటూ గ్రామానికి తీసుకెళ్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కోనసీమ: అల్లవరం మండలం గోడిలంక గ్రామంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన కాశీ నాగరాజు (55) సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మితిమీరిన వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అల్లవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం: పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఎవరు గుంపులుగా ఉండరాదని అర్ధవీడు ఎస్సై శివనాంచారయ్య తెలిపారు. బుధవారం అర్ధవీడులోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకున్నామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు.
కాకినాడ: డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా బుధవారం సామర్లకోట రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. నిర్మిత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. స్టేషన్ మేనేజర్ రమేష్ ఆధ్వర్యంలో అధికారులు డీఆర్ఏంకు ఘన స్వాగతం పలికారు.