PLD: చిలకలూరిపేట సాయిబాబా HP గ్యాస్ ఏజెన్సీలో బ్లాక్ మార్కెట్ విక్రయాలు జరుగుతున్నాయన్న వినియోగదారుల ఆరోపణలపై నిర్వాహకులు దుర్గారావు స్పందించారు. అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్ బుకింగ్ తర్వాత 12 రోజుల్లో డెలివరీ ఇస్తున్నామని, అయితే రెండు బుకింగ్ల మధ్య కనీసం 35 రోజుల గడువు అవసరమని ఆయన స్పష్టం చేశారు.
తిరుమలలో బుధవారం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం మొత్తం 78,381 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 25,451 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.46 కోట్లుగా నమోదైంది.
KDP: రాజంపేటలో రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తెలిపారు. “చమర్తి మార్నింగ్ వాక్” కార్యక్రమంలో భాగంగా అధికారులు, పార్టీ నాయకులతో కలిసి ప్రాంతాన్ని పరిశీలించారు. నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే భవన యజమానులతో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
బాపట్ల: ఇంకొల్లులో బుధవారం నిర్వహించిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ విధానం, విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అంతరాయం లేకుండా ప్రశాంతంగా పరీక్షలు జరగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
సత్యసాయి: ధర్మవరం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. రైల్వే శాఖలో GRP సీఐగా పనిచేస్తున్న అశోక్ కుమార్ భార్య చాముండేశ్వరి బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంలోనే ఆమె ఉరేసుకుని ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ELR: ఆగిరిపల్లి మండలం ఈదర గ్రామంలో బుధవారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.150 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని తెలిపారు.
SKLM: ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో ఫలక్నమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు కిందపడి యువకుడు మృతి చెందినట్లు GRP ఎస్సై ఎం. మధుసూదనరావు బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 35 ఏళ్లు ఉండి, నీలం కలర్ టీ షర్ట్ ధరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ తరలించినట్లు చెప్పుకొచ్చారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూలు బైపాస్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న రెడ్డి జన సంఘం కమ్యూనిటీ కన్వెన్షన్ హాల్ స్థలాన్ని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇవాళ సందర్శించారు. సంఘం సభ్యులు, స్థానిక ప్రజలతో సమావేశమై నిర్మాణ పనులపై చర్చించారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించి, అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ATP: సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన పౌర సేవలు అందించడం, పరిపాలనా సామర్థ్యం పెంపుపై చర్చించారు. స్వర్ణాంధ్ర విజన్- 2047 లక్ష్యంగా సింగపూర్‌లో అమలవుతున్న ఉత్తమ పాలనా పద్ధతులపై రాష్ట్ర మంత్రులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
AKP: నర్సీపట్నం(మం) చెట్టుపల్లిలో శ్రీరామనవమి సందర్భంగా పెళ్లిరాట వేసే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ప్రతి సంవత్సరం నవదంపతుల చేతుల మీదుగా పూజలు, కల్యాణోత్సవం నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. అనంతరం అన్నసంతర్పణ, ఊరేగింపు నిర్వహిస్తారని చెప్పారు. గ్రామ పెద్దల పర్యవేక్షణలో యూత్ సభ్యులు, ప్రజల సహకారంతో వేడుకలు జరగనున్నాయని పేర్కొన్నారు.
KRNL: హాలహర్వి మండలం మారెమ్మ గుడి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. అగ్రహారం గ్రామానికి చెందిన ఇసుక ట్రాక్టర్, ఆదోని ఎస్‌కేడీ కాలనీకి చెందిన బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
PPM: ఏపీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి బుధవారం సీతంపేటలో పర్యటించారు. ఈ మేరకు TTD ఆలయంలో శ్రీవారిని కమిటీ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు స్వాగతం పలికి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆయన ITDA కార్యాలయ ఆవరణలో అడవి తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు.
BPT: రేపల్లె ఆర్డీవోగా నియమితులైన బి. శ్రీదేవి బుధవారం అధికార బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. డివిజన్‌లో ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు.
తిరుపతి జిల్లాలో ప్రైవేట్ లా కళాశాలలు విద్యార్థుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని SVU విద్యార్థి సంఘాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా VC నర్సింగరావుకు వినతి పత్రం అందజేశారు. కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కంటే రెండింతలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
KDP: జిల్లాలో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అన్ని పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు ప్రశాంతంగా జరగేందుకు కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయడంతో పాటు ఫ్రిస్కింగ్ నిర్వహిస్తున్నారు. సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు.