ఫోన్ ట్యాపింగ్ వివాదం ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త మలుపు తిరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఓ భారీ కుదుపు కుదిపింది. రెండు రోజులుగా ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బుధవారం బహిర్గతం చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన ఆడియోలను విడుదల చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? అని నిలదీశారు. అనుమానం ఉన్న చోట తాను ఉండలేను అని ప్రకటించారు.
‘ప్రజా సమస్యలు ప్రశ్నిస్తున్నానని నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. నా ఫోన్ ట్యాప్ అవుతున్నట్లు నాలుగు నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు. నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందంటే నమ్మలేదు. సీఎంపై కోపంతో ఆ ఆధికారి అబద్ధం చెప్పారని భావించా. 20 రోజుల ముందు నా ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారం దొరికింది. పార్టీలో ఉన్నతస్థాయి నేతలు చెప్తేనే ఫోన్లు ట్యాప్ చేస్తారు. సీఎం జగన్ గానీ, సజ్జల గానీ చెప్పకుండా నా ఫోన్ ట్యాప్ చేయరు. అనుమానాలు ఉన్న చోట నేను ఉండాల్సిన అవసరం లేదు. నా ఫోన్ ట్యాపింగ్ నిజమని తెలిసి మనస్తాపం చెందా. నా దగ్గర ఉన్న ఆధారాలు బయటపెడితే.. కేంద్రానికి రాష్ట్రం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు ఐపీఎస్‌లకు ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. 15 నెలల తర్వాత ప్రజలు ఎలా తీర్పిస్తారో ఎవరికీ తెలియదు. సొంత పార్టీ నాయకులనే నమ్మకపోతే ఇక నేను పార్టీలో ఉండేదెందుకు?. కనీసం సంజాయిషీ కూడా అడగరా? నా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది’ అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆవేదన చెందారు.
‘వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయాలని లేదు. చిన్నపిల్లల ఆటలాగా ఇన్చార్జ్ గా మారుస్తారా? నిన్న బాలినేని వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. పార్టీ నుంచి వెళ్లేవారు వెళ్లొచ్చని బాలినేని అన్నారు. బాలినేని మాటలను సీఎం జగన్ మాటలుగా భావిస్తున్నా. అన్నా.. జగనన్నా.. నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎలా ఉంటుంది? సజ్జల, విజయసాయిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి ఫోన్లు ట్యాప్ చేస్తే ఎలా ఉంటుంది? మీరు పొరపాటు చేసి ట్యాపింగ్ జరగలేదని అబద్ధాలు చెబుతారా? కొన్ని రోజుల కింద నా బాల్య మిత్రుడితో ఐఫోన్లో మాట్లాడా. నా స్నేహితుడితో మాట్లాడిన విషయాలపై ఇంటెలిజెన్స్ చీఫ్ అడిగారు. ఐబీ చీఫ్ సీతారామాంజనేయులు నాకు ఆడియో పంపారు. ట్యాపింగ్‌కు ఇంతకుమించిన ఆధారాలు ఇంకేం కావాలి? ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఆడియో క్లిప్ బయటకు ఎలా వచ్చింది?. 9849966000 నుంచి నాకు ఆడియో క్లిప్ వచ్చింది. ఈ నంబర్ ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులుది కాదో తేల్చండి’ అని సవాల్ విసిరారు.
‘టీడీపీకి వెళ్తానని ముందుగానే కలలు కని ట్యాపింగ్ చేస్తారా? నా సంభాషణలను దొంగచాటుగా విన్నారు. ట్యాపింగ్ కాదంటే నిరూపించండి. నా ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ ఒక ఎమ్మెల్యేతో ఆగదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, జడ్జిల ఫోన్లూ ట్యాప్ చేస్తారు. హైకోర్టు సీజే ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేస్తారు. నేను ట్యాపింగ్ అంటున్నా.. కాదంటే మీరు నిరూపించండి. ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తా. దేశద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని ట్యాప్ చేస్తారు. ప్రభుత్వ పెద్దలే ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలి? ట్యాపింగ్‌పై కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయబోతున్నా’ అని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు.