తెలుగు రాష్ట్రాల పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ.. విశాఖలో… జనసేనాని పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ నేపథ్యంలో… వైసీపీ నేతలంతా.. పవన్ పై విమర్శలు చేస్తున్నారు. మా ప్రభుత్వం గురించి ప్రధానికి ఫిర్యాదు చేస్తారా అని మండిపడుతున్నారు. అయితే… పవన్ పై విమర్శలు చేస్తున్న వైసీపీ మంత్రులు, నేతలకు నాగబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు.
పవన్ ని చూసి వైసీపీ నేతలంతా ఎందుకు భయపడుతున్నారని నాగబాబు ప్రశ్నించారు. పూర్తి పరిజ్ఞానం లేని ఏపీ మంత్రులకు స్క్రిప్టు అందించినట్లే అందరికీ అందిస్తారని భ్రమ పడుతున్నట్లుందని విమర్శించారు. జనసేన పార్టీలో ఎవరికి వారే సొంతంగా తమ అవగాహనతో మాట్లాడతారన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏది మాట్లాడినా ఒకటికి పదిసార్లు ఆలోచించి వివేకంతో మాట్లాడతారన్నారు. జనసేనలో ఎవరికీ స్క్రిప్టులు అందించాల్సిన అవసరం లేదన్నారు. పార్టీలో గ్రామీణ స్థాయిలో ఉన్న అతి సామాన్య జన సైనికులు, వీర మహిళలు కూడా తమకున్న సామాజిక అవగాహనతో సొంత పరిజ్ఞానంతో మాట్లాడతారన్నారు.
పరిపాలన గాలికొదిలేసి పవన్ కళ్యాణ్ ఎవరితో, ఏం మాట్లాడారోనని మంత్రులు ఎందుకు ఆవేదన చెందుతున్నారో వారికే తెలియాలి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పవన్ కళ్యాణ్‌పై ఉన్న గౌరవంతో ఆయనను ఆహ్వానించి మర్యాదపూర్వకంగా మాట్లాడిన మాటలు కూడా విడమరచి చెప్పాలని మంత్రులు అడగడం వెనుక భయమో, అభద్రతా భావమో కూడా వారికే అర్ధం కావాలన్నారు. అధికారం చేజిక్కించుకున్న దగ్గర నుంచి జగనన్న జే-గ్యాంగ్ చేసిన అవినీతి లెక్కల వివరాలు అన్నీ జనసేన ప్రభుత్వం స్థాపించిన తర్వాత బయటికి తీస్తామన్నారు.