ప్రధాని నరేంద్రమోదీ.. ఏపీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ నగరంలో బస చేస్తున్న ఆయన.. జనసేనాని పవన్ తో భేటీ కూడా అయ్యారు. కాగా.. అంతక ముందు.. ఆయన రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ నేతలతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు.
జగన్ ప్రభుత్వ పాలనపై పోరాడాలని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని రాష్ట్ర బీజేపీ నేతలకు సూచించినట్లు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై ప్రశ్నించాలని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాటిపై ఛార్జిషీట్లు వేయాలని ప్రధాని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలపై సంతకాల సేకరణ కూడా చేపట్టాలని నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
ఏపీలో పార్టీ పరిస్థితి బాగాలేదని, బలోపేతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మోదీ సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు. ప్రతి చిన్న సమస్యపై కూడా గళమెత్తాలని, అప్పుడే పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందంటూ రాష్ట్ర నేతలకు చెప్పారు. మనకు మన పార్టీ ముఖ్యమని, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడంతో అలసత్వం అసలు ప్రదర్శించవద్దని మోదీ చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.