మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) చేసిన కామెంట్స్‌పై మెగా అభిమానులు మండిపడుతున్నారు. కొడాలి నాని వ్యాఖ్యలను నిరసిస్తూ ఏపీ (AP) లోని పలు జిల్లాల్లో మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఆందోళనలకు దిగారు.గుడివాడలో అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలో ర్యాలీని చేపట్టారు. జై చిరంజీవ… కొడాలి నాని డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. చిరంజీవి(Chiranjeevi)పై చేసిన వ్యాఖ్యలకు కొడాలి నాని బహిరంగ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, మెగా ఫ్యాన్స్ కు మధ్య తోపులాట జరిగింది.
చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి(Kandula Ravi)తో పాటు పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసు వాహనానికి అడ్డంగా రోడ్డుపై పడుకుని అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన మెగా ఫ్యాన్స్ ను నిలువరించడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. ప్రస్తుతం గుడివాడ(Gudivada)లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పలువురు అభిమానులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని తీసుకెళ్లనివ్వకుండా పోలీసు వాహనాలకు చిరంజీవి అభిమానులు అడ్డంగా పడుకున్నారు. ఫ్యాన్స్‌ను పోలీసులు నియంత్రించలేకపోయారు.అనంతపురం (Anantapur) నగరంలోనూ చిరంజీవి అభిమానుల నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. టవర్ క్లాక్ వద్ద ఫ్యాన్స్ నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్ గురించి చిరంజీవి మంచి మాటలు చెబితే, ఆయనపై వైసీపీ నేతలు(YCP leaders) వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చిరు ఫ్యాన్స్ హెచ్చరించారు.