ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును జనసేనాని రెండు రోజుల క్రితం కలిసిన విషయం తెలిసిందే. ఎప్పుడూ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసే వర్మ ఇప్పుడు బాబు-పవన్ కలయికపై కూడా సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. కేవలం డబ్బు కోసమే తన సొంత కాపులను కమ్మవాళ్లకు అమ్మి వేస్తాడని ఊహించలేదని ట్వీట్ చేశారు. ఇంకా రిప్ కాపులు, కంగ్రాట్యులేషన్ కమ్మవారు అంటూ ముగించారు. ఆయన ట్వీట్‌కు నెటిజన్లు ఘాటుగా స్పందించారు. ఇలా అనడానికి జగన్‌కు నువ్వు ఎంతకు అమ్ముడుపోయావ్ అని ఒకరు, రాజకీయాలను పట్టించుకోనని చెప్పావ్ కదరా, ఇప్పుడు జగన్‌తో దోస్తాన్ ఏమిటి అంటూ ఇంకొకరు, ఎన్నికల తర్వాత జగన్ ఫారెన్ చెక్కేస్తాడంట నిజమేనా అని ఇంకొకరు సమాధానం ఇచ్చారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్రంగానే స్పందించారు. నువ్వు కామంతో కాళ్లు నాకావ్ అనుకున్నాను, కానీ పేటీఎం డబ్బుల కోసం ఏమైనా నాకుతావని ఊహించలేదు అంటూ రిప్ ఆర్జీవీ, కంగ్రాట్స్ జగన్ అంటూ వర్మ స్టైల్లోనే కౌంటర్ ఇచ్చారు.
ఇక వర్మ వ్యాఖ్యలపై కాపు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ కాపు సంఘాల ఐకాస అతని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. వర్మ ట్వీట్ వెనుక వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ హస్తం ఉందని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలోని కాపు మంత్రులు అందరూ జాతిని జగన్‌కు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. కాపుల పైన కుట్రలో భాగంగానే రామ్ గోపాల్ వర్మ ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదన్నారు. కాపులు ఎదగడం ఇష్టం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.