వైసీపీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సినిమా తారలను టార్గెట్ చేయడం ఏమాత్రం సరికాదని, చిరంజీవి, బాలకృష్ణ సినిమాలను లక్ష్యంగా చేసుకొని పనిచేయడం మంచిది కాదని సీపీఐ రామకృష్ణ నిప్పులు చెరిగారు. ఎప్పుడైనా రాజకీయాల్లో కక్ష సాధింపు ఉండవద్దన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆయనను టార్గెట్ చేయడం వేరే అంశమని చెప్పారు. కానీ రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులను, ఇతర నటులను టార్గెట్ చేయవద్దన్నారు. సినీ నటి రోజా ఎక్కడున్నా ఆనందంగా ఉంటారని, కాబట్టి సినిమాలకు ఆటంకం కలిగించవద్దని ఆమె తెలుసుకోవాలన్నారు. తాను జబర్దస్త్ షోను కూడా చూస్తానన్నారు. జగన్ టాలీవుడ్‌ని టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోందన్నారు.
బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించాలని సినిమా బృందం భావించింది. మొదట స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని ఏబీఎం కళాశాల మైదానంలో నిర్వహించేందుకు అనుమతి కోరగా, పోలీసులు నిరాకరించారు. ఆ తర్వాత అర్జున్స్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన పదిహేడు ఎకరాల స్థలాన్ని అధికారులతో కలిసి చిత్ర బృందం పరిశీలించి, ఇక్కడ ఏర్పాట్లకు అనుమతి తీసుకున్నది. తర్జనభర్జనల అనంతరం మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇక్కడ ప్రీ-రిలీజ్ ఇవెంట్‌కు సిద్ధం చేస్తున్నారు. ఇదంతా కక్ష సాధింపులో భాగమేనని భావిస్తున్నారు. ఇదే అంశాన్ని ఇప్పుడు రామకృష్ణ లేవనెత్తారు.