సీఎం జగన్పై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అన్నీ వర్గాలను ఇబ్బందికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. చివరికి ఉద్యోగులను కూడా వదలడం లేదన్నారు. అన్ని డిపార్ట్మెంట్లలో ఇదే పరిస్థితి అని వివరించారు. పోలీసులు గవర్నమెంట్ వద్ద జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ పేరుతో కొంత సొమ్ము జమ చేస్తారు. దానిని పిల్లల చదువు.. లేదంటే పెళ్లిళ్లు, ఇల్లు కట్టుకునే అవసరాలకు వాడుకుంటారు. ఆ సొమ్మును కూడా సీఎం జగన్ వదల్లేదని చెప్పారు. రూ. 800 కోట్లు వాడుకున్నారని ఆరోపించారు.
పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తానని చెప్పి మోసం చేశాడని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. డీఏ లేదు, టీఏ లేదు, ఏరియల్స్ కూడా ఇవ్వడం లేదన్నారు. హోమ్ గార్డులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి మోసం చేశాడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కన్నా వెయ్యి రూపాయల జీతం ఎక్కువ ఇస్తానని చెప్పాడు. తెలంగాణ రాష్ట్రంలో హోంగార్డు కి 30 వేలు పైగా జీతం ఉంటే, ఆంధ్రప్రదేశ్లో 21 వేలు మాత్రమే ఇస్తున్నాడని గుర్తుచేశారు. రాష్ట్ర జనాభా ప్రకారం ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐ, కానిస్టేబుళ్ళు మొత్తం కలిపి 75 వేల మంది పోలీసులు ఉండాలి.. 60 వేల మంది మాత్రమే ఉన్నారని చెప్పారు.
జనాభాకి తగిన పోలీసులు లేని రాష్ట్రాల్లో ఆంద్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని అయ్యన్నపాత్రుడు చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా పోలీసు రిక్రూట్ మెంట్ లేదని చెప్పారు. రిక్రూట్ మెంట్ లేకపోవడంతో.. పనిభారం కింద, మధ్య స్థాయిలో ఉన్న పోలీసులపై పడుతుందని చెప్పారు. అందుకోసమే హత్యలు, గంజాయి రవాణా, లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. వెంటనే పోలీస్ రిక్రూట్ మెంట్ చేపట్టాలని.. అలాగే హోం గార్డుల వేతనం పెంచాలని కోరారు. పోలీసుల ప్రొవిడెంట్ ఫండ్ వారికి జమ చేయాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.