Chandrababu Naidu Shocking Comments on AP Elections. ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని స్పస్టం చేశారు. ఏ క్షణంలో అయినా సీఎం వైఎస్ జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలపునిచ్చారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా రికార్డు స్థాయిలో 160 సీట్లు గెలుచుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలలో సుమారు 75 మంది అసంతృప్తితో ఉన్నారని, వీరంతా ఆ పార్టీ నుండి ఏ క్షణంలో అయినా బయటకు వస్తారని అన్నారు.
అంతేకాకుండా, ఆ పార్టీని కేసులు చుట్టుముడుతున్నాయని, సీఎం వైఎస్ జగన్ సైతం కేసుల్లో ఇరుక్కునున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన మారిపోయిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో పరిపాలన సాగించడం జగన్కు అత్యంత కష్టంగా మారిందని అన్నారు. డబ్బులు లేకుండా ఎక్కువ రోజులు నడవని పరిస్థితులు ఏర్పడ్డాయని చంద్రబాబు విమర్శించారు.
కనీసం ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని, అప్పులు తీసుకొచ్చి సంక్షేమాల పేరుతో డబ్బులు ఖర్చు చేస్తున్నారని, ఆదాయం లేకుండా పథకాలను అమలు చేస్తే తద్వారా వచ్చే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. ఒక్క కొత్త బిల్డింగును కూడా నిర్మించలేని పరిస్థితుల్లో ఉన్న జగన్ సర్కార్ మూడు రాజధానులను ఏ విధంగా అభివృద్ధి చేయగలదని ప్రశ్నించారు. ప్రస్తుత తరుణంలో జగన్కు ఎన్నికలకు వెళ్లడం మినహా మరో మార్గం లేదని అన్నారు.