వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవచ్చని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జగన్ ఇవ్వలేను అంటే తానైనా ఏమీ చేసేదీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందు వాపోయారు. ఏది ఏమైనా విబేధాలు పక్కనపెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని కార్యకర్తలు, నాయకులకు సూచించారు. కొన్నాళ్ల నుంచి బాలినేని పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి అంటీముట్టనట్టుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సోమవారం మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణస్వీకారం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో బాలినేని మాట్లాడుతూ.. ‘వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది. రాబోయే ఎన్నికల్లో నాకు కూడా టికెట్ రాకపోవచ్చు. నా భార్య సచీదేవికి టికెట్ ఇస్తారేమో?. నీకు సీటు లేదు.. నీ భార్యకు ఇస్తామని సీఎం జగన్ చెబితే నేనైనా ఏమీ చేయలేను. ఈసారి మహిళలే అని తేల్చి చెబితే నేనయినా పోటీ నుంచి తప్పుకోవాల్సిందే’ అని పేర్కొన్నారు.