»Isro Is Ready For A Key Launch On The First Day Of 2024
ISRO: 2024 తొలి రోజునే కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2024 జనవరి 1వ తేదిన మరో రాకెట్ ను అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ మేరకు సోమవారం రాకెట్ ప్రయోగానికి అన్నీ సిద్ధం చేసినట్లు ఇస్రో వెల్లడించింది.
చంద్రయాన్3, ఆదిత్య ఎల్1 ప్రయోగాలతో విజయం సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ముఖ్య ప్రయోగాన్ని 2024 కొత్త సంవత్సరం తొలి రోజునే ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా స్వదేశీ ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహాన్ని ఇస్రో జనవరి 1వ తేదిన అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.
సోమవారం ఉదయం 9.10 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇందుకోసం శనివారం ప్రయోగ సన్నద్ధతపై లాంచ్ ఆథరైజేషన్ సమావేశాలను ఇస్రో అధికారులు నిర్వహించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
జనవరి 1వ తేదిన సోమవారం రాకెట్ ను ప్రయోగించడానికి ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. మునుపటి పరిశోధనలకు భిన్నంగా ఈసారి ఎక్స్-రేతో ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ విశ్వరహస్యాలను ఛేదించడానికి ఈ మిషన్ ను ఇస్రో ప్రారంభించనుంది. ఈ ఎక్స్‌పోశాట్ జీవితకాలం ఐదేళ్లు కావడం విశేషం. అయితే ఇదేవిధంగా ఎక్స్‌పోశాట్ ఉపగ్రహంతో పాటూ మరో పది ఇతర పేలోడ్లను కూడా ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టనుంది.