»Isro Has Recently Revealed That The Lakes Formed By The Melting Of Snow Mountains In The Himalayas Are Expanding Due To Global Warming
Isro : విస్తరిస్తున్న హిమానీ సరస్సులు.. ఆందోళన వ్యక్తం చేసిన ఇస్రో
భూతాపం వల్ల హిమాలయాలు కరిగి అక్కడున్న సరస్సులు అంతకంతకూ విస్తరిస్తున్నాయని ఇస్రో ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
Isro : వాతావరణ పరిస్థితులు అంతకంతకూ దారుణంగా తయారవుతున్నాయి. మానవ తప్పిదాల ఫలితంగా భూతాపం నానాటికీ పెరిగిపోతోంది. దీంతో మన దేశ సరిహద్దులుగా ఉన్న హిమాలయాలు క్రమంగా కరిగిపోతున్నాయి. అలా కరిగిపోవడం వల్ల ఏర్పడ్డ సరస్సుల(glacial lakes) విస్తీర్ణం నానాటికీ పెరిగిపోతుంది. ఈ విషయాన్ని చెబుతూ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) ఆందోళన వ్యక్తం చేసింది. 2016, 2017ల్లో హిమాలయాల్లో(Himalayas) వారు 2,431 సరస్సుల్ని గుర్తించారు. వాటిలో 601 సరస్సులు ఇప్పుడు 89 శాతం మేర విస్తరించిపోయాయని ఇస్రో చెబుతోంది. అంటే తమ పరిమాణాన్ని దాదాపుగా డబుల్ సైజ్ కి పెంచుకున్నాయని తెలిపింది.
భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉండటం వల్ల కొత్త కొత్త సరస్సులు ఏర్పడుతున్నాయని, ఉన్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తెలిపింది. సరస్సులు విస్తరించడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. 1984 నుంచి 2023 వరకు భారతీయ హిమానీ నదాలు, సరస్సుల శాటిలైట్ చిత్రాల్ని ఇస్రో(ISRO) విశ్లేషించింది. వీటి పరిమాణంలో చెప్పుకోదగ్గ రీతిలో మార్పులు వచ్చినట్లు గమనించింది. ఇందూస్ రివర్ బేసిన్లో ఉన్న సరస్సుల్లో 676 సరస్సులు పెద్ద ఎత్తున విస్తరించినట్లు తెలిపింది. అందులో 130 సరస్సులు మాత్రమే భారత్ పరిధిలో ఉన్నాయని చెప్పింది.