»Bridge Collapse On Manair River In Peddapalli District
Bridge : గాలేస్తే వంతెన కూలిపోయింది సార్!
తెలంగాణ పెద్దపల్లి జిల్లాలోని మానేరు నదిపై ఓ వంతెన నిర్మాణం జరుగుతోంది. సోమవారం రాత్రి ఈదురుగాలులు వీయడంతో అది కూలిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Bridge Collapse : ఈదురు గాలులకు వంతెన కూలిపోయింది. అవునండీ.. మీరు వింటున్నది నిజమే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లాలో(Peddapalli District) చోటు చేసుకుంది. అక్కడి ఓడేడు పరిధిలో ఉన్న మానేరు వాగుపై(Manair Vagu) 2016లో వంతెన కట్టడం ప్రారంభించారు. ఆ పనులు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. నిధులు లేమితో వంతెన నిర్మాణం అలాగే ఆగిపోయింది. సోమవారం అర్ధరాత్రి అక్కడ భారీగా ఈదురు గాలులు వీచాయి. దీంతో వంతెన గడ్డర్లు కూలిపోయాయి. అలా నిర్మాణం పూర్తికాక ముందే వంతెన కూలిపోయింది.
అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇదే పగటి వేళ జరిగితే అటువైపుగా జన సంచారం ఉంటుంది. దీంతో ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదృష్టవశాత్తూ అర్ధరాత్రి ఈ ఘటన జరగడంతో ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని అంటున్నారు. మంగళవారం ఉదయం ఈ వంతెన(Bridge) కూలిపోవడాన్ని గమనించిన అక్కడి వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేపట్టారు.