»Nasa Shares Stunning Pic Of Rare Gigantic Jets Spotted Over Himalayas
Gigantic Jets: హిమాలయాలపై కళ్లు చెదిరే మెరుపుల చిత్రాన్ని విడుదల చేసిన నాసా
హిమాలయాల మీద అద్భుతమైన మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్ అని పిలిచే ఈ అరుదైన మెరుపుల చిత్రాలన్ని తాజాగా నాసా విడుదల చేసింది. వీటి ప్రత్యేకతనూ వివరించింది.
Gigantic Jets: సాధారణంగా మనం మెరుపుల్ని చూస్తూ ఉంటాం. ఒకటి రెండు పక్కపక్కనే వచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్లు వాటిని క్యాప్చర్ చేయడమూ చూసే ఉంటాం. అయితే నాలుగైదు ప్రత్యేకమైన మెరుపులు గత వారం హిమాలయాలపై మెరిశాయి. ఆ అద్భుతమైన చిత్రాన్ని నాసా(NASA) తాజాగా విడుదల చేసింది. గత వారం ఈ చిత్రాన్ని పిక్చర్ ఆఫ్ ద డే అంటూ పోస్ట్ చేసింది. ఇవి సాధారణంగా వచ్చే మెరుపుల కంటే కాస్త భిన్నమైనవి. వీటిని గైజాంటిక్ జెట్స్(Gigantic Jets) అని ఆంగ్లంలో పిలుస్తుంటారు.
చైనా, భూటాన్ల దగ్గరలో ఉన్న హిమాలయ పర్వతాల్లో(Himalayas) ఈ చిత్రాన్ని షూట్ చేసినట్లు నాసా ప్రకటించింది. ఇలాంటి ప్రత్యేకమైన మెరుపులు శతాబ్ద కాలంలో వేళ్ల మీద లెక్క పెట్టేంత సంఖ్యలో మాత్రమే మనకు కనిపిస్తుంటాయట. భూ వాతావరణంలో ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల ఇవి సాక్షాత్కారం అవుతాయని నాసా ఫోటో డిస్క్రిప్షన్లో రాసింది. వీటిని ‘అన్ యూజువల్ టైప్ ఆప్ లైటింగ్స్’ అంటూ పేర్కొంది.
గత వారంలో హిమాలయాల దగ్గర వాతావరణ పరిస్థితులు కాస్త భిన్నంగా ఉన్నాయి. పిడుగులు పడ్డాయి. ఆ సమయంలోనే ఈ గైజాంటిక్ జెట్స్(Gigantic Jets) ప్రత్యక్షం అయ్యాయి. ఇవి సాధారణమైన మెరుపుల కంటే 50 శాతం శక్తివంతంగా ఉంటాయి. గత ఏడాది ఓ ప్యుర్టోరికో ఫోటోగ్రాఫర్ కెమెరాకు సైతం ఈ అరుదైన మెరుపులు చిక్కాయి. 2018లో మన దేశంలోని ఒడిశాలోనూ ఇవి కనిపించాయి. ప్రస్తుతం నాసా విడుదల చేసిన ఈ చిత్రం ఆన్లైన్లోనూ హల్చల్ చేస్తోంది.