చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా ఇంకా కొన్నేళ్లపాటు వాయిదా వేసింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే.
Nasa: చంద్రుడిపైకి మనుషుల్ని పంపే జాబిల్లి యాత్రను నాసా ఇంకా కొన్నేళ్లపాటు వాయిదా వేసింది. దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపాలని అమెరికా చేసిన ప్రయోగం విఫలమైన సంగతి తెలిసిందే. పెరిగ్రిన్ వ్యోమనౌక ప్రయోగాన్ని ఇంధన లీకేజీ కారణంగా విరమించుకోవాల్సి వచ్చింది. ఈ వైఫల్యంతో నాసా భవిష్యత్తులో చేపట్టే జాబిల్లి యాత్రలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ ఏడాది చంద్రుడు చుట్టూ నలుగురు వ్యోమగాములను పంపాలని నాసా భావించింది. అయితే దాన్ని 2025కు వాయిదా వేసింది.
ఈ ఏడాది చివర్లో ఆర్టెమిస్-2 యాత్రను నిర్వహిస్తామని నాసా గతంలో ప్రకటించింది. అయితే ఇందులో నలుగురు వ్యోమగాములను జాబిల్లి ఉపరితలానికి 9 వేల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి పంపించనున్నారు. తాజా పరిణామాలతో ఈ ప్రయోగాన్ని వచ్చే ఏడాది సెప్టెంబరుకు వాయిదా వేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ తెలిపింది. 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపైకి మనుషులను పంపించే ఆర్టెమిస్-3 యాత్ర 2026కు వాయిదా పడింది. ఈ యాత్రలో ఒక మహిళ సహా నలుగురు వ్యోమగాములను చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి పంపించాలని నాసా సన్నాహాలు చేస్తోంది.
ప్రైవేటు కంపెనీ ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన పెరిగ్రిన్ ల్యాండర్‌ను గత సోమవారం వుల్కన్ రాకెట్ ద్వారా ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఏడు గంటల తర్వాత ఈ వ్యోమనౌకలో ఇబ్బంది తలెత్తింది. ఇంధనాన్ని కోల్పోవడం వల్ల ఈ సమస్య ఎదురైనట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని విరమించుకున్నారు. భవిష్యత్తులో చేప్టటబోయే ఆర్టెమిస్ యాత్రలకు నాసా ప్రైవేటు కంపెనీలపై ఆధారపడింది.
తాజాగా విఫలమైన పెరిగ్రిన్ ల్యాండర్లో జాబిల్లి ఉపరితలాన్ని శోధించే అనేక సైన్స్ పరికరాలున్నాయి. ఆర్టెమిస్ యాత్రలో వెళ్లే వ్యోమగాములు దిగాల్సిన ప్రదేశాన్ని నిర్దేశించడం కూడా దీని ప్రయోగ లక్ష్యాల్లో ఒకటి. ఈ ప్రయోగం విఫలం కావడం వల్లే నాసా తదుపరి యాత్రలను ఆలస్యం చేసుకోవాల్సి వచ్చింది. వచ్చే నెలలో మరో ప్రైవేటు కంపెనీ అభివృద్ధి చేసిన ల్యాండర్‌ను నాసా ప్రయోగించనుంది.