అద్భుతమైన గాత్రంతో ప్రజలను సమ్మోహితం చేసే గాయని సునీత. ఆమె గొంతులో నుంచి వచ్చే మెలోడీ పాటలు ఒక విధమైన లోకంలోకి తీసుకెళ్తాయి. సినీ సంగీత ప్రపంచంలో ఆమెది చెరగని ముద్ర. ఇప్పుడు ఆమె వారసత్వం కూడా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అయితే గాత్రం పరంగా కాకుండా నటనాపరంగా ఆమె వారసుడు వస్తున్నాడు. ఆమె కుమారుడు ఆకాశ్ గోపరాజు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు సమక్షంలో సినిమా పనులు మొదలయ్యాయి.
రాఘవేంద్ర రావు నిర్మాతగా ఆర్కే టెలి షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్న సినిమా ‘సర్కారు నౌకరి’. గంగనమోని శేఖర్ దర్శకత్వంలో సునీత తనయుడు ఆకాశ్ హీరోగా, కొత్త అమ్మాయి భావనా వళపండల్ హీరోయిన్ గా నటిస్తోంది. పూజా కార్యక్రమాల అనంతరం రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టగా.. జీ స్టూడియోస్ నిర్మాత ప్రసాద్ నిమ్మకాయల కెమెరా స్విచ్ఛాన్ చేశారు. సునీత, తన భర్త రామ్ తో కలిసి పాల్గొంది. ఫిబ్రవరి 6 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని సినిమా యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాకు సంగీతం శాండిల్యా అందిస్తున్నాడు. కుమారుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో సునీత భావోద్వేగానికి లోనైంది.