విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం జరిగి బోట్లు దగ్ధమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు. నేడు నష్టపోయిన మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించారు. ఒక్కొక్కరికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం మత్స్యకారులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. నవంబర్ 19న అగ్నిప్రమాదంలో బోట్లు దగ్ధం అవ్వడం బాధాకరమన్నారు.
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దగ్ధమైన సంఘటన స్థలాన్ని పరిశీలించిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. pic.twitter.com/YNW39DDc7G
తానిచ్చే డబ్బుతో బాధితుల కష్టాలు తీరిపోతాయని నమ్మనని, కానీ కష్టం వస్తే మాత్రం అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. జనసేన పార్టీ మత్స్యకారులకు అండగా ఉంటుందన్నారు. జనసేన వీరమహిళలు, జనసైనికులు ఉన్నారని, అందరికి భరోసా కల్పించడమే తమ పార్టీ ఉద్దేశమన్నారు. గతంలో కౌలు రైతులకు కూడా ఈవిధంగానే సాయం చేసినట్లు తెలిపారు. రూ.30 లక్షల వరకూ మత్స్యకారులకు అందించినట్లు వెల్లడించారు.
1976లో హార్బర్ ప్రారంభమైందని, 700 మరబోట్లతో మత్స్యకారులు కార్యకలాలపాలు సాగిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు పడతాయనే ఉద్దేశంతో తాను ఆర్థిక సాయం చేయడం లేదని, నిజంగా తాను అలాంటి వ్యక్తినికానని తెలిపారు. తెలంగాణలో జనసేన పార్టీ బీజేపీతో కలిసి పనిచేస్తోందని, అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ఆపి మరీ విశాఖకు వచ్చి ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. త్రిముఖ పోటీ ఉంటే గెలవడం సాధ్యం కాదని, అందుకే టీడీపీతో చేయి కలిపినట్లు తెలిపారు. జనసేన అధికారంలోకి వస్తే మత్స్యకారులకు ఏ సమస్యా రాకుండా చూస్తానని హామీ ఇచ్చారు.