»Preparation For Governance From Visakha Allotment Of Buildings To Respective Departments
Visakhapatnam: విశాఖ నుంచి పాలనకు సిద్ధం.. ఆయా శాఖలకు భవనాల కేటాయింపు
విశాఖ నుంచి పాలనకు అన్ని ఏర్పాట్లను వైసీపీ సర్కార్ పూర్తి చేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని శాఖలు అక్కడికి తరలి వెళ్లాయి. తాజాగా మిగిలిన అన్ని శాఖలకు సంబంధించి భవనాలను కేటాయించాలని జీవో జారీ అయ్యింది. అందుకోసం ప్రత్యేక కమిటీని కూడా సీఎం జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది.
ఏపీ సర్కార్ విశాఖ (Visakhapatnam) నుంచి పాలనకు సిద్ధమైంది. అందుకోసం ఆయా శాఖలు విశాఖకు తరలిపోనున్నాయి. రాష్ట్రంలో మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా సర్కార్ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం సీఎం జగన్ (Cm Jagan)తో పాటుగా మంత్రులు, అధికారులు సమీక్షలు చేపట్టనున్నారు. ఆ సమీక్షలను విశాఖలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకోసం విశాఖకు మంత్రులు, అధికారులు తరలి వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ఏయే శాఖలకు ఎక్కడెక్కడ భవనాలను కేటాయించారో చెబుతూ జీవో జారీ అయ్యింది.
విశాఖలో ఇప్పటికే చాలా శాఖలకు తమ తమ సొంత భవనాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లోనే మంత్రులు క్యాంపు ఆఫీస్ (Camp Offices) ఏర్పాటు చేయాలని, అధికారులు కూడా బస చేసేందుకు ప్రత్యేక భవనాలను ఏర్పాటు చేయాలని జీవోను జారీ చేశారు. మంత్రులు, అధికారులందరూ ఆ భవనాల్లోనే తమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భవనాల కేటాయింపు కోసం ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. సొంత కార్యాలయాలు లేని శాఖలకు రిషికొండలో ఏర్పాటు చేసిన మిలినియం టవర్స్‌లో లక్ష 75 వేల 516 చదరపు అడుగుల స్థలాన్ని ప్రభుత్వం ఎంపిక చేసింది. తాజా ఉత్తర్వులతో విశాఖలో క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు కావాలని ఆయా శాఖలకు ఆదేశాలు అందాయి. దీంతో చర్యలు ప్రారంభించారు.