తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి హైకోర్టులో ఊరట లభించింది. మై హోం రామేశ్వర్ రావు వేసిన పరువు నష్టం దావా కేసును టీఎస్ హైకోర్టు (High Court) కొట్టివేసింది.సీఎం కేసీఆర్ అండదండలతో హైటెక్ సిటీ ప్రాంతంలో మై హోం సంస్థ అక్రమాలకు పాల్పడిందని 2014లో రేవంత్ రెడ్డి ఆరోపించారు.ఈ ఆరోపణల వల్ల సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం ఏర్పడిందని, అందుకు రూ.90 కోట్లు చెల్లించాలని రామేశ్వర్ రావు (Rameshwar Rao) రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు.
ఈ పిటిషన్పై వాదనలు విన్న హైకోర్టు కేసు నిరాధారమైనదని భావించి ఇవాళ కొట్టివేసింది.అయితే ఈ ఆరోపణలు చేసిన సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నారు. కాగా, 2014 నాటి దావాలో తాజాగా తీర్పు రావడం రేవంత్ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది తెలిసిందే. 2015లో తెలంగాణ (Telangana) ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు సంచలనం రేపిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ(TDP) కి మద్దతివ్వాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వజూపిన వైనంపై కేసును ఎదుర్కొంటున్నారు. రూ.50 లక్షలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఏసీబీ (ACB) రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక శాఖ పరిధిలోకి రాదంటూ ఆయన తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక్కడ చుక్కెదురు కావడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ పిటిషన్ను తిరస్కరించింది.