ఇజ్రాయెల్(Israel) -హమాస్ యుద్దం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా స్వదేశానికి తరలిస్తోంది.ఈ తరలింపు ఆపరేషన్‌కు కేంద్రం ‘ఆపరేషన్ అజయ్ (Operation Ajay)’ అని పేరు పెట్టింది. ఈ ఆపరేషన్ అజయ్‌లో భాగంగా 212 మంది భారతీయులతో తొలి విమానం ఢిల్లీకి చేరుకుంది. తొలి విమానంలో ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీ(Delhi)కి చేరుకున్న ప్రయాణికుల ఫోటోలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చీ ట్విటర్ (X) లో షేర్ చేశారు. తన పోస్టుకు ‘వెల్కమ్ టు ది హోమ్‌లాండ్ (Welcome to the homeland)’ అని భారతీయులను స్వాగతిస్తూ వెల్కమ్ నోట్ జతచేశారు.
కాగా, ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్రం బుధవారం ఆపరేషన్ అజయ్ కార్యక్రామానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తొలి విమానంలో ఇవాళ 212 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు.ఆపరేషన్ అజయ్ (Ajay)’పై భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయుల్లో విద్యార్థులే అధికంగా ఉన్నారు. వైద్యం, వ్యవసాయం, టెక్నాలజీ (Technology) తదితర రంగాల్లో విద్యాభ్యాసం, పరిశోధనల కోసం భారతీయులు ఇజ్రాయెల్ వెళ్లారు.
ఇజ్రాయెల్ నుంచి తొలి విమానంలో వచ్చిన భారతీయులు టెల్ అవీవ్(Aviv), హైఫా నగరాల్లో నివసిస్తున్నారు.హమాస్ విరుచుకుపడ్డ సమయంలో సైరన్లు (Sirens) వినిపించాయని భారతీయులు చెబుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న అంశాలపై ముందే వారికి శిక్షణ ఇచ్చారు. బాంబు షెల్టర్ల(Bomb shelters)కు పరుగులు తీసి భారతీయులు ప్రాణాలు కాపాడుకున్నారు. హమాస్ ఉగ్రవాదుల ఊచకోతతో భారతీయులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.