Chandrababu: అంగళ్లు అల్లర్ల కేసులో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి (Chandrababu) ఊరట కలిగింది. ముందస్తు బెయిల్ ఇస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని స్పష్టం చేసింది. సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు ఆగస్ట్ 8వ తేదీన వెళ్లిన సమయంలో అంగళ్లు చౌరస్లా ఘర్షణ జరిగింది. దాంతో చంద్రబాబు సహా టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఆ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.
అధికార వైసీపీకి చెందిన వారే చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లు విసిరారని చంద్రబాబు తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వ్యక్తిగత భద్రతా సిబ్బంది చంద్రబాబుకు రక్షణగా నిలిచారని పేర్కొన్నారు. దాడికి సంబంధించిన వీడియోలను కోర్టుకు అందజేశారు. వైసీపీ శ్రేణులు దాడి చేసి.. నాలుగు రోజుల తర్వాత తప్పుగా ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఎందుకు లేట్ చేశారో కారణం మాత్రం వివరించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాత చంద్రబాబు ర్యాలీ తీశారని.. ర్యాలీలో అలజడి సృష్టించాలని ముందస్తు ప్రణాళికతో రాళ్లు వేశారని వివరించారు. ఈ కేసులో పలువురు నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించిందని తెలిపారు. పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. పిటిషనర్ ప్రోద్బలంతో దాడి జరిగిందన్నారు. పిటిషనర్, ఆయన అనుచరులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండాల్సిందని సూచించారు.
చంద్రబాబు చెప్పిన తర్వాత దాడులకు దిగారని.. దాంతో పోలీసులు గాయపడ్డారని వివరించారు. బెయిల్ పిటిషన్ కొట్టివేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.