తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో అయితే పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.కోడిపందాల వద్ద పందేం రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గోదావరి జిల్లాల్లో అయితే.. కోడి పందేలు మరో లెవల్ అనే చెప్పాలి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు, నిడమానూరు, ఈడుపుగళ్లు, ఆకునూరు, ఉయ్యూరు, ముదినేపల్లిల్లో జోరుగా పందేలు జరుగుతున్నాయి. వేరేప్రాంతాల నుంచి వచ్చిన చాలామంది కోడి పందాల్లో పాల్గొంటున్నారు. పోటాపోటీగా సాగుతున్న పందాల్లో డబ్బుల గురించి ఆలోచించడం లేదు. అయితే పందెం రాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు ఈసారి ఆఫర్లు పెట్టడం గమనార్హం. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో కోడి పందేలు ఆడేవారికి బహుమతులు ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు. మా దగ్గర పందాలు కాయండి.. బుల్లెట్ బండి, స్కూటీ గెలవండి అంటూ ప్రకటించారు.
గుడ్లవల్లేరులో నిర్వాహకుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో పందెం కాసేవారిని ఆకర్షించేందుకు బుల్లెట్ బండి ఆఫర్లు ప్రకటించారు. కౌతవరం, వేమవరం బరుల నిర్వాహకులు ఇలా ఆఫర్ పెట్టారు. అందుకు కండీషన్ కూడా పెట్టారు. రూ. 2 లక్షల విలువైన కోడిపందేలను వరుసగా ఐదుసార్లు ఆడితే రూ. 1.75 లక్షల విలువైన బుల్లెట్ బండి ఇస్తామంటున్నారు. దీంతోపాటు లక్ష విలువైన పందేలు వరుసగా ఐదుసార్లు ఆడితే స్కూటీ గిప్ట్ అంటూ ప్రకటించారు. ఆ బహుమతులను బరుల వద్దే ప్రదర్శనకు ఉంచారు. వాటిని చూసి కొందరు టెంప్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బుల్లెట్ బండి కావాలంటే రూ.10 లక్షలు పెట్టి పందెం కాయాలి.. అదే స్కూటీ కావాలంటే రూ.5 లక్షలు కావాలి. కానీ కొందరు అలా అనుకోరని.. పందెం అంటే ఆట అని, మజా కోసం ఆడుతామంటున్నారు పందెం రాయుళ్లు.