మాజీమంత్రి, టీడీపీ నేత నారాయణకు చెందిన విద్యాసంస్థల కార్యాలయంలో ఏపీ సీఐడీ అధికారులు నిన్న (మంగళవారం) మరోసారి సోదాలు నిర్వహించారు. మాదాపూర్ మిలాంజ్ టవర్స్ పదో అంతస్తులో గల ఆఫీసుకు ఉదయం 10 గంటలకు 40 మంది అధికారులు చేరుకుని, అర్ధరాత్రి వరకు తనిఖీలను చేపట్టారు. పలు హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరాతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో 2020లో సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నారాయణను ప్రశ్నించేందుకు అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లో గల తన నివాసంలో మంగళవారం ఎదురుచూస్తుండగా, అధికారులు కార్యాలయానికి వెళ్లి సోదాలు చేశారు. విషయం తెలుసుకున్న నారాయణ అక్కడకు చేరుకున్నారు.
నారాయణ ఆఫీసులో విద్యార్థుల జాబితా, ఫీజుల చెల్లింపుల వివరాలు కావాలని సీఐడీ అధికారులు అడిగారు. అమరావతి భూముల కేసుతో విద్యార్థుల ఫీజులకు సంబంధం ఏంటీ అని సిబ్బంది అడిగారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. తర్వాత అక్కడికి చేరుకున్న నారాయణ, ఏ సమాచారం కావాలి అనుకుంటే తీసుకోవాలని సీఐడీ అధికారులను స్పష్టంచేశారు. సోదాలు నిర్వహించేందుకు పూర్తిగా సహకరించారు. పలు రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ అంశాలపై నారాయణను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. సాయంత్రం 5 గంటల తర్వాత అక్కడినుంచి పంపించివేశారు. అవసరమైతే మళ్లీ పిలుస్తామని, తమకు అందుబాటులో ఉండాలని కోరారు. నారాయణకు చెందిన సంస్థల్లో సోదాలు నిర్వహించడం ఇది రెండోసారి. రెండు నెలల క్రితం నారాయణ విద్యాసంస్థలకు చెందిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పుడు రెండోసారి హైదరాబాద్లో గల ప్రధాన కార్యాలయంలో రైడ్ చేశారు.
అమరావతి రాజధాని ఇన్నరింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పుల కేసులో నారాయణతోపాటు టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ1గా చంద్రబాబు, ఏ-2గా నారాయణను చేర్చారు. 2014–19 మధ్య చేపట్టిన భూసేకరణలో అవకతవకలు జరిగాయని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో నారాయణకు సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేయగా.. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్లో గల ఆయన నివాసంలో ప్రశ్నించాలని హైకోర్టు సీఐడీ అధికారులకు స్పష్టంచేసింది. ఇటీవల నారాయణ ఇంట్లో అధికారులు స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. ఇప్పుడు మరోసారి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.