ఐటీ ఉద్యోగ కల్పనలో బెంగళూరును తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాటి వేసిందని మంత్రి కేటీ రామారావు అన్నారు. అయితే ఇక్కడ బెంగళూరును తక్కువ చేసి చూపించాలనేది తన ఉద్దేశ్యం కాదని, తాము అధికారంలోకి వచ్చాక అన్నింటా అభివృద్ధి దూసుకు వెళ్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో 5 మిలియన్ ఉద్యోగాలు ఉంటే, ఇందులో 1 మిలియన్ ఉద్యోగాలు కేవలం హైదరాబాద్, తెలంగాణ నుండే ఉన్నాయన్నారు. అంటే 20 శాతం హైదరాబాద్ నుండి ఉందని, ఇది చాలా గొప్ప విషయమన్నారు.
వ్యాపారవేత్తలు కూడా హైదరాబాద్ వైపు ఆకర్షితులు అవుతున్నారన్నారు. 2014లో తాము అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. హైదరాబాద్లో ఎక్కడ, ఎలా అభివృద్ధి చేయాలో తమకు తెలుసునని ప్రతిపక్షాలకు చురకలు అంటించారు. ప్రతిపక్షాలు మెట్రో రైలు ప్రాజెక్టు మొదలు, వివిధ అంశాలపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. దీంతో ఆయన అభివృద్ధి ఎలా చేయాలో తమకు తెలుసునని చెప్పారు. ఐటీ పరిశ్రమలు ఉన్న ప్రాంతంలోనే అభివృద్ధి అనడం సరికాదన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తామన్నారు.