హాస్యబ్రహ్మ బ్రహ్మానందం(brahmanandam) మాట్లాడుతూ ఈ సినిమాలో నేనొక పాత్ర చేశాను. పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. 18-20 సంవత్సరాల వయసు నుంచే నేను ఆయనను చూస్తున్నాను. ఆయన నవ్వు ఎంత స్వచ్ఛంగా, ఎంత అందంగా ఉంటుందో ఆయన కూడా అంతే అందమైన మనిషి. సరదాగా నవ్విస్తూ ఉంటారు. మనిషి అంతా మంచితనం, మనిషి అంతా హాస్యం. ఏ రకంగా ఆయన దగ్గరకు వెళ్తే ఆ రకంగా దర్శనం ఇవ్వగల దైవాంశసంభూతుడు మా పవన్ కళ్యాణ్. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాత విశ్వప్రసాద్ గారు పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ సినిమాలు తీస్తాను అన్నారు. ఇంతటి గట్స్ ఉన్న నిర్మాత విశ్వప్రసాద్ గారి ఆల్ ది బెస్ట్” అన్నారు.
కథానాయిక కేతిక శర్మ(ketika sharma) మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు సముద్రఖని గారికి కృతఙ్ఞతలు. పీపుల్ మీడియా బ్యానర్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తేజ్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని పేర్కొన్నారు.
కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్(priya prakash varrier) మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను ఈ పాత్రకు ఎంపిక చేసినందుకు సముద్రఖని గారికి ధన్యవాదాలు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇచ్చిన మద్దతుని, ప్రోత్సాహాన్ని మర్చిపోలేను. థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. నాలాంటి నూతన నటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో నటించే అవకాశం రావడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయన నాలో స్ఫూర్తి నింపారు. సాయి ధరమ్ తేజ్ తో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. తేజ్ తో కలిసి మరిన్ని సినిమాలు చేయాలని ఉందని తెలిపారు.
చిత్ర దర్శకుడు సముద్రఖని(samuthirakani) మాట్లాడుతూ ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టి, చెన్నై వచ్చి, అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చి బ్రో సినిమా చేశాను. నాకు టైం వచ్చింది కాబట్టే ఇది సాధ్యమైంది. నేనేది ప్లాన్ చేయలేదు, అదే జరిగింది. మన పని మనం చేస్తుంటే మన టైం వస్తుంది. నేను ఒకసారి త్రివిక్రమ్ అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు నాకొక ఫోన్ కాల్ వచ్చింది. నేను చేసిన సినిమా విడుదలై పది రోజులు అవుతుంది. ఒక 73 ఏళ్ళ పెద్దాయన సినిమా చూసి బాగా ఎమోషనల్ అయ్యి నాకు ఫోన్ చేసి మాట్లాడారని చెప్పాను. అన్నయ్య కథ చెప్పమంటే ఒక పది నిమిషాల్లో చెప్పాను. ఆయనకు కథ నచ్చి, పవన్ కళ్యాణ్ గారితో చేస్తే బాగుంటుంది అన్నారు. అప్పుడు త్రివిక్రమ్ అన్నయ్య రూపంలో నేను టైంని చూశాను. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో ఇలా చేస్తే బాగుంటుందని ఆయనే చెప్పారు. అప్పటినుంచి ఏడాదిన్నర ఈ సినిమా పని మీదే ఉన్నాను. ఎప్పుడూ ఒక్క శాతం కూడా నమ్మకం కోల్పోలేదు. టైం కోసం ఎదురుచూశాను. టైం వచ్చింది. టైం(పవన్ కళ్యాణ్)ని కలిశాను. ఆయనను కలిసి మొత్తం స్క్రిప్ట్ అంతా వినిపించాక, షూటింగ్ ఎప్పటినుంచి అనుకుంటున్నారు అని అడిగారు. మీరు రెడీ అంటే రేపటి నుంచే సార్ అనగానే ఆయనొక చిరునవ్వు నవ్వారు. దానిని మర్చిపోలేను. 70 రోజులు చేయాల్సిన పనిని 20 రోజుల్లో చేశాను. అంత పవర్ ఉంది, అంత ఎనర్జీ ఉంది. పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడం అదృష్టం. సోదరుడు తేజ్ తో పని చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు” అన్నారు.
నిర్మాత టి.జి. విశ్వప్రసాద్(tg vishwa prasad) మాట్లాడుతూ ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ సినిమా మొదటిరోజు మొదటి షో చూడటం గొప్ప అవకాశం అనుకునేవాడిని. అలాంటిది పవన్ కళ్యాణ్ గారితో పరిచయం ఏర్పడి ఆయనను దగ్గరనుంచి చూసే అవకాశం దొరికింది. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మొదటి సినిమా నిర్మించే అవకాశం దక్కింది. దీనికి త్రివిక్రమ్ గారి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తోడయ్యాయి. కళ్యాణ్ గారు ఇచ్చిన టైంలో సముద్రఖని గారు సినిమా పూర్తి చేశారు. దీనినే టైం కలిసిరావడం అంటారు. సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక అభిమానిగా మీరేం కోరుకుంటున్నారో అవన్నీ ఈ సినిమాలో ఉంటాయి. పవన్ కళ్యాణ్ టైంగా విశ్వరూపం చూపించిన ఈ సినిమా మా బ్యానర్ లో 25వ సినిమా కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు.
ఇది కూడా చూడండి: Bro pre release event photos: బ్రో ప్రీరిలీజ్ ఈవెంట్ సిత్రాలు
సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల(vivek kuchibhotla) మాట్లాడుతూ ఈ సినిమా భగవత్గీతను నర్సరీ రైమ్ అంత సింపుల్ గా చెప్తే ఎంత బాగుంటుందో అంతా బాగా త్రివిక్రమ్ రాశారు. పండితులకు, పామరులకు అర్థమయ్యేలా అంత అద్భుతంగా సముద్రఖని గారు తీశారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చెప్పే ప్రతిమాట రాసుకోదగ్గది. ఇంతమంచి సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉందని అన్నారు.
ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు టీజీ వెంకటేష్(tg venkatesh) మాట్లాడుతూ “అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటూ, ఆ డబ్బుని దాచిపెట్టుకోకుండా ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగిస్తున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మా సోదరుడు టీజీ విశ్వప్రసాద్ ఇలాంటి మంచి చిత్రాలు మరిన్ని తీయాలని కోరుకుంటూ మూవీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం(am ratnam) మాట్లాడుతూ తాను 22 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఆయనలో నేనొక ఎంజీఆర్ ని చూశాను. ఎంజీఆర్ గారు ప్రతి సినిమాలో పాటల్లో గానీ, మాటల్లో గానీ ప్రజలకు ఉపయోగపడే పదాలు రాయిస్తారు. పవన్ కళ్యాణ్ గారితో నేను ‘ఖుషి’ చేసేటప్పుడు హిందీ సాంగ్ పెడదాం అన్నారు. మొదటిసారి తెలుగు సినిమాలో హిందీ పాట అయినా ఏమాత్రం వెనకాడకుండా పెట్టాం. ఆ పాటలో అద్భుతమైన సందేశం ఉంటుంది. ఒక ప్రేమకథలో కూడా సందేశం ఇవ్వాలని ఆరోజుల్లోనే ఆయన ఆలోచించారు. ఎంజీఆర్ లాగా సినిమా ద్వారా ప్రజలకు మంచి చెప్పాలనుకునే గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన తెరమీద కనిపిస్తేనే బాక్సాఫీస్ బద్దలవుతుంది. మేనమామ పవన్ కళ్యాణ్ గారితో కలిసి సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అన్నారు.
ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్(bvsn prasad) మాట్లాడుతూ.. “మా సేనాని పవన్ కళ్యాణ్, మా హీరో సాయి ధరమ్ తేజ్, త్రివిక్రమ్.. ఈ చిత్ర బృందమంతా నాకు కుటుంబసభ్యులు లాంటివారు. దర్శకనిర్మాతలకు ఆల్ ది బెస్ట్. అని చెప్పారు. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ వేడుక పాటల ప్రదర్శన, నృత్య ప్రదర్శన, అభిమానుల కోలాహలం నడుమ ఎంతో వైభవంగా జరిగింది. జీ స్టూడియోస్ తెలుగు హెడ్ నిమ్మకాయల ప్రసాద్, రోహిణి, ఊర్వశి రౌతేలా, యువలక్ష్మి, అలీ రెజా, గణేష్ మాస్టర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.