Anil Kumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలు క్యాంపెయిన్ స్పీడ్ పెంచాయి. గెలుపు గుర్రాలకే టికెట్లు అని పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. గెలిచే పార్టీ వైపు కొందరు అభ్యర్థులు చూస్తున్నారు. నల్గొండ కాంగ్రెస్‌లో ముసలం నెలకొంది. కాంగ్రెస్ ముఖ్యనేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీరుతో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి (Anil Kumar) విసుగెత్తిపోయారు. ఈ రోజు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
భువనగిరిలో సోమవారం ఓ ఫంక్షన్ హాల్లో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు చేశారు. కోమటిరెడ్డితో తనకు ఇబ్బందులు ఉన్నాయని తెలిపారు. తన ఇంట్లో ఆరు సీట్లు తీసుకున్నప్పుడు కోమటిరెడ్డికి బీసీలు గుర్తురాలేదా అని అడిగారు. ఇప్పుడు భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని క్యాడర్‌ను డిస్టర్బ్ చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మారానని అప్పుడు ప్రకటన చేశారు. ఇష్యూను హై కమాండ్ దృష్టికి తీసుకెళతానని చెప్పారు. వారి స్పందనను బట్టి నిర్ణయం ఆలోచిస్తానని వివరించారు. కానీ కొన్ని గంటల్లోనే అనిల్ కుమార్ రెడ్డి (Anil Kumar) ప్రగతి భవన్ వచ్చారు. అక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని కలిశారు. సీఎం కేసీఆర్‌ను కలిసి.. ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థిగా అనిల్ కుమార్ బరిలోకి దిగే అవకాశం ఉంది. టికెట్‌పై స్ఫష్టత ఇచ్చిన తర్వాతే.. పార్టీలో చేరినట్టు తెలుస్తోంది.
ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించేది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపు రాజకీయాలు.. ఒకరికొకరికీ పడదు.. ఇప్పుడు ఓ జిల్లా అధ్యక్షుడు పార్టీ మారడం.. ఆ పార్టీకి మైనస్ అవుతుంది.