The Supreme Court stopped the survey in Jnanavasi Masjid
Jnanavasi Masjid: వారణాసిలోని కాశీ విశ్వనాథ(Kashi Vishwanatha) ఆలయ సమీపంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వే వ్యవహారంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. శివలింగం ఉన్నట్లుగా భావిస్తున్న వజుఖానా మినహా మసీదు ఆవరణ మొత్తం సైంటిఫిక్ సర్వే చేయాలంటూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై రెండు రోజులపాటు అపెక్స్ కోర్టు స్టే విధించింది. జులై 26 సాయంత్రం 5 గంటల వరకు మసీదు ప్రాంగణంలో ఎలాంటి సర్వే చేపట్టరాదని ఆదేశాలు ఇచ్చింది.
చదవండి:Oppenheimer: శృంగారం సీన్లో భగవద్గీత శ్లోకం.. ఆ సినిమాపై విమర్శలు
జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టేందుకు భారత పురావస్తు(archeology) విభాగ అధికారుల బృందం సోమవారం అక్కడికి చేరుకొని సర్వే ప్రారంభించింది. ఇదే సమయంలో దీన్ని వ్యతిరేకిస్తూ మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వారణాసి కోర్టు ఇచ్చిన సర్వే ఆదేశాలపై స్టే విధించాలని కోరింది. ఈ పిటిషన్పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నేడు అత్యవసర విచారణ చేపట్టింది.
సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో పురావస్తు అధికారులు తవ్వకాలు చేపడతారా… అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ.. మసీదు ప్రాంగణంలో నిర్మాణాల తొలగింపు లేదా తవ్వకాలు చేపట్టట్లేదని, ఒక్క ఇటుకనూ తొలగించరని, ప్రస్తుతానికి కేవలం కొలతలు, ఫొటోగ్రఫీ, రాడార్ ప్రక్రియ మాత్రమే కొనసాగుతోందని తెలిపారు. ఇది మసీదు నిర్మాణాలపై ఎలాంటి ప్రభావం చూపించదు అని కోర్టుకు వివరించారు. దీంతో వారణాసి కోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది. వారణాసి కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టుకు వెళ్లేందుకు మసీదు కమిటీకి అనుమతినిచ్చింది.