శేరిలింగంపల్లి నియోజకవర్గంలో యువనేత రఘున్నకు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు భారీ కార్, బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువత పెద్దఎత్తున పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి (Serilingampally) నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని యువనేత మారబోయిన రఘునాథ్ యాదవ్ (Raghunath Yadav) ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజాపరిపాలన చేతకాకుంటే దిగిపోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మం సభ(Khammam Sabha)లో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునాథ్ యాదవ్ కు మద్దతుగా శేరిలింగంపల్లిలో సోమవారం భారీ కార్, బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేశారు. గచ్చిబౌలి స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఆదిత్య నగర్ వరకు కొనసాగింది.
ర్యాలీ అనంతరం రఘునాథ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనను తుదముట్టించేది కాంగ్రెస్ పార్టీ (Congress party) మాత్రమేన్ననారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి మహిళలు, వృద్ధుల వరకు అందరి సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు ఎకరాకు రూ.15వేల పెట్టుబడి ఇస్తుందని తెలిపారు. వితంతువులు, వృద్ధాప్య పింఛన్లను రూ.4000 వేలకు పెంచుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏటా జూన్ 2నే జాబ్ క్యాలెండర్ (Job calendar) వేస్తుందని హామీ ఇచ్చారు. ఉద్యోగాలు సాధించే వరకు నిరుద్యోగులకు రూ.4000 నిరుద్యోగ భ్రుతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యావత్ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉందన్నారు.
దుర్మార్గపు బీఆరెఎస్ (BRS ) పాలనకు అంతం పలికి, కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు ఎన్నికలకోసం ప్రజలు వేచి చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరాచకాలకు చరమగీతం..గత తొమ్మిదేళ్ల కాలంలో శేరిలింగంపల్లి అన్ని రంగాల్లో వెనకబడి పోయిందన్నారు రఘునాథ్ యాదవ్. నాలుగు ఐటీ బిల్డింగులు చూపి అదే అభివృద్ధి అంటున్నారని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. శేరిలింగంపల్లి బస్తీల్లో కనీస సౌకర్యాలు లేక పేదల బాధలు వర్ణనాతీతం అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ (MLA Arikepudi Gandhi) అవినీతి, అక్రమాలతో శేరిలింగంపల్లి ప్రతిష్ట పూర్తిగా మసకబారిందన్నారు. ఎమ్మెల్యే భూకబ్జాలు, అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు తీవ్రఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వాపోయారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంతో ఎమ్మెల్యే అరాచకాలకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.