ఈ ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడడంతో.. ఇక రవితేజకు హిట్ కష్టమే అనుకున్నారు. కానీ ధమాకా మాసివ్ బ్లాక్ బస్టర్ అందించింది. రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్గా.. దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఎంటెర్టైనర్ ‘ధమాకా’ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులుపుతోంది. రవితేజ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ దిశగా ఈ చిత్రం దూసుకుపోతోంది. ఫస్ట్ డే 10 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. మొత్తం వరల్డ్ వైడ్‌గా ఐదు రోజుల్లో 49 కోట్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఆరో రోజు 7 కోట్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 6 రోజుల్లో 56 కోట్లు అందుకున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఫైనల్‌గా ఈ సినిమాతో మాస్ మహారాజా మరో 50 కోట్ల సినిమాను తన ఖాతాలో వేసుకున్నట్టే. అంతేకాదు ఈ వీకెండ్ వరకు ధమాకా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. వాటిలో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు లేవు. నిఖిల్ 18 పేజెస్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. ధమాకా మాస్ దెబ్బకు కాస్త డీలా పడిపోయాడు. దాంతో ఈ వారం కూడా ధమాకా హవానే కొనసాగే ఛాన్స్ ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ వాల్తేరు వీరయ్యతో కలిసి సంక్రాంతికి సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ. ఆ తర్వాత రావణసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వీటిలో టైగర్ నాగేశ్వరరావు పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతోంది. ఏదేమైనా.. రవితేజకు మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో.. ధమాకా నిరూపించిందనే చెప్పాలి.