బాలీవుడ్ హీరో సుశాంత్రాజ్ పుత్ (Sushantraj Puth) మృతిపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫడ్నవీస్ మాట్లాడుతూ ఈ కేసులో ప్రాథమిక సమాచారం అంతా వాళ్లు వీళ్లు చెప్పిన మాటల ఆధారంగానే ఉంది. కానీ ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి కొంత మంది తమ వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారని వాటిపై తాము చర్యలు తీసుకున్నామన్నారు. 2020 జూన్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. ముంబయి(Mumbai)లోని తన అపార్ట్మెంట్లో విగతజీవిగా కనిపించారు.
తొలుత ఆయన ఆత్మహత్య (Suicide) చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇందులో కుట్ర కోణం ఉందని ఆయన కుటుంబసభ్యులు ఆరోపించారు. దీంతో ఈ కేసులో సీబీఐ (CBI) దర్యాప్తు చేపట్టింది. మరోవైపు సుశాంత్ మరణానికి వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ (Disha Salian) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో కుట్ర కోణం ఉందనే ఆరోపణలు రావడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. మూడేళ్లు గడిచినా ఈ కేసులో ఎలాంటి పురోగతి రావడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫడ్నవీస్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.