తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి జూనియర్లు అంటే ఒకవిధంగా రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పవచ్చు. రేవంత్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని, ఆయన తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సీనియర్లను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ కూడా రేవంత్‌కు అనుకూలంగా పని చేస్తున్నారనేది సీనియర్ కాంగ్రెస్ నేతల వాదన. రేవంత్ వర్సెస్ సీనియర్ల అంశం రోడ్డున పడింది. దీంతో అప్రమత్తమైన పార్టీ అధిష్టానం సీనియర్లు, జూనియర్ల మధ్య పరిష్కారం కోసం దిగ్విజయ్ సింగ్‌ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. డిగ్గీ ఒక్కో నేతతో మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకొని, ఆ తర్వాత ఓ మీడియా సమావేశం పెట్టారు. ఆయన వ్యాఖ్యలు ఒకవిధంగా సీనియర్లకు వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నాయి.
అయినప్పటికీ రెండు రోజులుగా రాష్ట్రంలో ఓ వార్త రాజకీయ వేడిని రాజేస్తోంది. అదే రేవంత్ రెడ్డి కొత్త పార్టీ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ల నుండి నిత్యం వ్యతిరేకత, తిరుగుబాటు నేపథ్యంలో రేవంత్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పేరుతో ఎన్రోల్ అయింది. ఇది రేవంత్ సొంత పార్టీగా ప్రచారం సాగుతోంది. పార్టీ అధిష్టానం తనకు అనుకూలంగా ఉన్నప్పటికీ, సీనియర్లు, ఇతర అసంతృప్త నేతలు తనను టార్గెట్ చేయడంతో ఆయన పార్టీ వ్యవహారాలపై సరైన దృష్టి సారించే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. పార్టీ అధిష్టానం సీనియర్లను బుజ్జగించి వెళ్లింది తప్పితే, సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.
ఇలాంటి సమయంలో సీనియర్లు, ఇతర అసంతృప్త నేతలు తన పార్టీ కార్యకలాపాలకు ఇలాగే అడ్డుపడుతుంటే కొత్త కుంపటితో ముందుకు వెళ్ళడమే మంచిదని రేవంత్ రెడ్డి భావించి ఉంటారని అంటున్నారు. కాంగ్రెస్‌లో కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయని, ఇక్కడే ఉండి నిత్యం ఇబ్బందులు పడటం కంటే సొంత పార్టీ పెట్టుకొని, ముందుకు వెళ్తే బాగుంటుందని అనుచరులు, ఆయనకు అనుకూలంగా ఉండే పలువురు నాయకులు ఒత్తిడి తెచ్చారని తెలుస్తోంది. ఈ కారణంగానే తెలంగాణ సామాజిక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం వద్ద నమోదయిందని అంటున్నారు.
ఇది తమకు సంబంధించినది కాదని, తెలంగాణ సామాజిక కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని రేవంత్ వర్గీయులు గట్టిగా చెబుతున్నప్పటికీ, మీడియాలో మాత్రం ఆయన పార్టీగానే ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌లో పరిస్థితి ఇలాగే ఉంటే, ఇలాగే తన చేతులు కట్టేస్తే కనుక, మరికొద్ది రోజుల్లో సొంత పార్టీ కార్యకలాపాలు ముమ్మరం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి మాత్రం ఈ ప్రచారంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. పార్టీని అప్రతిష్టపాలు చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఇలా ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.