»Video Viral The Child Dug A Well After Seeing The Mothers Difficulty
Video Viral: తల్లి కష్టం చూసి బావి తవ్విన బుడ్డోడు!
గుక్కెడు నీళ్ల కోసం గుండెపగిలేలా ఏడ్చే బతుకులెన్నో మన దేశంలో ఉన్నాయి. కిలోమీటర్ల మేర నడిచి తాగటానికి నీరు తెచ్చుకుని జీవిస్తున్న వారు ఇంకా మన దేశంలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో ఇంకా నీటి సమస్య తాండవిస్తూనే ఉంది. గొంతు తడపడం కోసం ప్రాణాలను బిగపెట్టి పోరాటం చేస్తున్న తల్లులెందరో సుదూర ప్రాంతాల్లో మనకు దర్శనమిస్తారు.
కష్టాలొచ్చినప్పుడు ఆ దేవుడే దిగి వచ్చి ఆదుకుంటారంటారు. కన్నీళ్లను తుడిచి నేనున్నాంటూ భరోసా ఇచ్చే ఓ చేయి కోసం ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. నీటి యుద్ధ భూమిలో నేనున్నానంటూ ఓ బిడ్డ గొంతెత్తాడు. బొబ్బలెక్కిన తన తల్లి కాళ్లను చూసి ఆ బిడ్డ కుమిలిపోయాడు. నడుం బిగించి అమ్మ కష్టాన్ని తీర్చాడు. ఓ 14 ఏళ్ల బాలుడు తన తల్లి కోసం అపర భగీరథుడై తమ గ్రామానికి నీటిచుక్కనందించాడు. పలుగూ పార పట్టి అమ్మ కోసం ఆ బాలుడు బావినే తవ్వాడు. నీటి కోసం కిలోమీటర్ల కొద్దీ నడిచి వెళ్లే ఆ ఊరి మహిళలకు దేవుడయ్యాడు.
దేశ వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీటి కష్టాలు ఇంకా అలానే ఉన్నాయి. మహారాష్ట్రలో అయితే నీటి కష్టాలు వర్ణనాతీతం. గుక్కడె నీటి కోసం వాడు పడే బాధ వర్ణణాతీతం. మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడు ప్రణవ్..నీటి కోసం తన తల్లి పడుతున్న బాధను చూశాడు. మండుటెండలో బిందెలతో సుదూర ప్రాంతం నుంచి నీళ్లు తెస్తున్న తన తల్లిని చూసి తట్టుకోలేకపోయాడు.
ప్రణవ్ తవ్విన బావి వీడియో:
#WATCH | Palghar, Maharashtra: Distressed upon seeing his mother walk every day in the sun to fetch water for the house, 14-year-old Pranav Salkar dug a well in his front yard with the help of his father. The family lives in Dhavange Pada near Kelve. Pranav's parents, Darshana… pic.twitter.com/H5WzkbzGIs
9వ తరగతి చదువుతున్న ప్రణవ్ తన తల్లి దర్శన కోసం ఏదోకటి చేయాలనుకున్నాడు. తనకు సమయం దొరికినప్పుడల్లా ఇంటి ఆవరణలోనే ఓ బావిని తవ్వుతూ వచ్చాడు. అమ్మ కోసం అతడు పడి శ్రమ అంతా ఇంత కాదు. ప్రతి రోజూ తన తల్లి కష్టాన్ని తలచుకుని బావిని తవ్వేవాడు. మట్టిని తీస్తూ నీటి కోసం ఎదురుచూసేవాడు. అలా అతను పడిన కష్టానికి ఆ గంగమ్మ తల్లే కనికరించింది. భూమిలోంచి గంగ ఉబికి వచ్చింది. బావిలోకి వస్తున్న ఆ నీటిని చూసిన ప్రణవ్కు పట్టరానంత ఆనందం. తన తల్లికి ఆ సంతోషకర విషయాన్ని చెప్పాడు. తల్లి కళ్లల్లో ఆనందం చూసి పొంగిపోయాడు.
ప్రణవ్ చేసిన పనికి ఆ ఊరి మహిళలంతా పండగ చేసుకున్నారు. బావిలోని గంగమ్మకు నమస్కరించి గొంతును తడుపుకున్నారు. చిన్న వయసులోనే తల్లి కోసం అహర్నిశలు కష్టపడి ఇప్పుడు ఊరికే దేవుడయ్యాడు. ప్రణవ్..నువ్వు సల్లగుండాలి బిడ్డా అంటూ ఊరి ప్రజల ప్రశంసల మధ్య చిరునవ్వు చిందించాడు. ఇలాంటి బిడ్డను కన్న ఆ తల్లి దర్శనను అందరూ అభినందిస్తున్నారు. ప్రణవ్..ఇప్పుడు ఎందరికో ఆదర్శమయ్యాడు. మారుమూల ప్రాంతాల్లో నీటి కోసం పోరాటం చేస్తున్న ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యాడు. హ్యాట్సాఫ్..ప్రణవ్