టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలోనే ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయన డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే రాజకీయ పార్టీల అధ్యక్షుల సమావేశంలో బాబు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో భారత్లో నిర్వహించే జీ-20 భాగస్వామ్య దేశాల సదస్సుపై చర్చించనున్నారు.
డిసెంబర్ 1, 2022 నుంచి నవంబర్ 30, 2023 వరకు జీ20 దేశాల కూటమి సమావేశాలకు భారత్ అధ్యక్షత వహించనుంది. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది.
రాజకీయ పార్టీలతో నిర్వహించే ఈ సమావేశంలో.. ఆ సదస్సుకు సంబంధించి సూచనలు, అభిప్రాయాలను కేంద్రం తెలుసుకోనుంది. ఈ మేరకు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఫోన్ చేసి ఈ సమావేశానికి ఆహ్వానించారు. కేంద్రం ఆహ్వానం మేరకు మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.