కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార(Kantara)’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోంది. అయితే ఈ సినిమా విజయంలో కంటెంట్‌తో పాటు మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా బీజిఎం గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మరీ ముఖ్యంగా ‘వరాహ రూపం’ పాట అదరగొడుతోంది. అయితే ఈ పాట తమ ‘నవసర’కు కాపీ అని ‘తైక్కుడం బ్రిడ్జ్(Thaikkudam Bridge)’ అనే మళయాళ మ్యూజిక్ బ్యాండ్ ఆరోపించింది.
అంతేకాదు ఆ పాటని సినిమా నుంచి తొలగించాలని మ్యూజిక్ బ్యాండ్ వారు కోర్టుని ఆశ్రయించారు. ఈ విషయంలో కాంతార టీమ్‌కు కోర్టులో చుక్కెదురైంది. కేరళలోని థియేటర్లతో పాటు ఇతర స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్‌లో ‘వరాహ రూపం’ పాటను ప్లే చేయకూడదని.. కేరళ కోజికోడ్ సెషన్స్ కోర్టు ‘కాంతార’ నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది. చిత్ర నిర్మాత, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు కాంతార మ్యూజిక్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది.
దాంతో సినిమాకే హైలెట్‌గా నిలిచిన ‘వరాహ రూప’ సాంగ్ లేకుండా ఈ సినిమాను ఊహించుకోలేమంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే.. వసూళ్ల పరంగా దూసుకుపోతోంది కాంతార. తెలుగులో ఇప్పటికే 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. అలాగే ఈ సినిమా పై సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో సహా పలువురు సెలబ్రిటీస్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.