పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయంగా వేగం పెంచుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా… తెలంగాణలో కూడా తన పార్టీని విస్తరించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే పవన్ త్వరలో తెలంగాణలో పర్యటించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పర్యటనపై పార్టీ తెలంగాణ విభాగం సమావేశం నిర్వహించింది. పలు కీలక విషయాలు వెల్లడించింది.
కొండగట్టు నుంచి జనసేనాని యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలంగాణ జనసేన నేతలు తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. పవన్ యాత్ర కు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఇటీవల మంగళగిరిలో జనసేన కార్యాలయంలో కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో పోటీ విషయంలో తన మనసులో మాటను వెల్లడించారు. తెలంగాణలో 7 నియోజకవర్గాల్లో పోటీ చేయాలా? 14 నియోజకవర్గాల్లో పోటీ చేయాలా అనే విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని పవన్ అన్నారు. అదే విధంగా రెండు లేదా మూడు లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించిన అనంతరం అనేక విషయాలలో మరింత క్లారిటీ రానుంది. ఎన్ని స్థానాల్లో పోటీకి దిగనుంది? ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనుందో అనే విషయాలు తేలనున్నాయి.